Pravallika Suicide : కేసులో బిగ్ ట్విస్ట్! శివరాం రాథోడ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్

by Rajesh |
Pravallika Suicide :  కేసులో బిగ్ ట్విస్ట్! శివరాం రాథోడ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నిరుద్యోగ యువతి ప్రవళిక సూసైడ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శివరాం రాథోడ్ బెయిల్ రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌ను అక్టోబర్ 21న పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కేసులో సరైన సాక్షాధారాలు లేనందున శివరాంకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం శివరాం రాథోడ్ బయట ఉండగా అతడి బెయిల్ రద్దు చేయాలని తాజాగా చిక్కడపల్లి పోలీసులు కోర్టును ఆశ్రయించడం ఆసక్తిగా మారింది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్ నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఎన్నికల వేళ ప్రవళిక ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసులు మాత్రం శివరాం రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని ఆ కోరణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో తమ కుమారుడిని అన్యాయంగా ఇరికిస్తున్నారని శివరామ్ రాథోడ్ తల్లి ఆరోపించారు.



Next Story