BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మున్సిపల్ వైస్ చైర్మన్, 16 మంది కౌన్సిలర్లు

by Rajesh |
BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మున్సిపల్ వైస్ చైర్మన్, 16 మంది కౌన్సిలర్లు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, 16మంది మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యాల్ల సాయి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి సుదర్శన్ రెడ్డి ఆహ్వానించారు.

గతంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో మంతనాలు జరిపారన్న అనుమానాలతో మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సహకారంతో గత ఏడాది చివర్లో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంలో తొలుత ఆర్మూర్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, ఆమె వర్గీయులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించిన, ఆమె కంటే ముందుగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మరో వర్గం కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ కండువాలు కప్పుకోవడం ఆర్మూర్‌లో చర్చనీయాంశమైంది.

ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గంలోని రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీకి మొగ్గుచూపుడంతో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఝలక్ తగిలింది. సోమవారం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి జిల్లాలోని కాంగ్రెస్ కురువృద్ధుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యప్ప లావణ్య శ్రీనివాస్, ఖాందేష్ సంగీత శ్రీనివాస్, గంగా మోహన్ చక్రు, ఏనుగంటి వరలక్ష్మి లింబాద్రిగౌడ్, సుంకరి ఈశ్వరి రంగన్న, లిక్కి శంకర్, బండారి ప్రసాద్, మేడిదాల సంగీత రవి గౌడ్, వనం శేఖర్, కొనపత్రి కవితా కాశీరాం, అతిక్, రాము, ఫయాజ్, నర్సారెడ్డి, ఇంతియాజ్, రహమాన్‌లు ఉన్నారు. వీరితో పాటు వీరికి మద్దతుగా ఎంఐఎం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ జహీర్ ఆలీ వారితో వెళ్లారు. అదేవిధంగా ఈ శనివారం మున్సిపల్‌కు చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్లు బారడ్(డార్లింగ్) రమేష్, అల్జాపూర్ రేవతి గంగా మోహన్ (మహేందర్)‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, 16 మంది కౌన్సిలర్లు తెలిపారు.

Advertisement

Next Story