BIG Scam: ప్లాట్లు ఇప్పిస్తామని ఘరానా మోసం..! రూ.100 కోట్లకు కుచ్చుటోపీ

by Shiva |   ( Updated:2025-01-28 02:03:15.0  )
BIG Scam: ప్లాట్లు ఇప్పిస్తామని ఘరానా మోసం..! రూ.100 కోట్లకు కుచ్చుటోపీ
X

దిశ, వనస్థలిపురం: ‘హరిణి వనస్థలి నేషనల్ పార్కు’ను ప్రైవేట్ ల్యాండ్‌గా చూపిస్తూ పేదలను బురిడీ కొట్టించిన అక్రమార్కుల భూ బాగోతం బట్టబయలైంది. ఎల్బీనగర్ నియోజకవర్గం.. మన్సూరాబాద్ ​పరిధిలోని సర్వే నంబర్7లో 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తమ వారసత్వ భూమి అని పట్టాలు సృష్టించి అమ్మిన యూసఫ్ ఖాన్, తులసమ్మ అలియాస్ సుల్తానా దంపతులు, స్కాం సూత్రదారి అడ్వకేట్​ షేక్​ జిలానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు ఫారెస్ట్​ ఆఫీసర్లు, అటు కొనుగోలుదారులు సోమవారం పోలీసులకు వరుసగా కంప్లైంట్లు ఇచ్చారు. అయితే గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘరానా మోసం వెనుక పలు కోణాలు బయట పడుతున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న కొందరు పెద్దల అండతో అక్రమార్కులు రూ. 200 కోట్లు సేకరించడమే లక్ష్యంగా స్కెచ్​ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు రూ. 100 కోట్లకు పైగానే కొనుగోలుదారుల నుంచి వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. ఎస్కే జిలానీ, యూసఫ్ ఖాన్, తులసమ్మ అలియాస్ సుల్తానా ముగ్గురు ముఠాగా ఏర్పడి ఏజెంట్లను నియమించుకుని ఈ దందా సాగించినట్లు చెప్తున్నారు.

రూ. 200 కోట్లు వసూలు చేసేందుకు స్కెచ్​?

ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న హైకోర్టు అడ్వకేట్​మహ్మద్ ​జిలానీ గత ప్రభుత్వ హయాంలోని పెద్దల అండతో ఈ ప్లాన్​ వేసినట్లు తెలుస్తోంది. ఈ భూమి వ్యవహారానికి సంబంధించి పలువురు బాధితులు కోర్టులో 280 పిటిషన్లు దాఖలు చేయగా.. ఒక్కో ఫిటిషన్‌లో 150 మందికి పైగానే బాధితులు ఉన్నారని ఇటీవల ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అలా 42 వేల మందిని జమ చేసి వారితో కేసులు వేయించారు 50 వేల మంది పేదలకు దానంగా ఇచ్చిన పట్టా భూమిని.. హైకోర్టు‌లో తన సొంత ఖర్చులతో కష్టపడి గెలిచానని 50 వేల మందికి ప్లాట్లు ఇవ్వడమే లక్ష్యం అంటూ తరుచూ చెప్తుండేవాడని బాధితులు చెప్తున్నారు. ఇలా 50 వేల మందికి ఒక్కొక్కరి నుంచి రూ.35 వేల చొప్పున వసూలు చేశాడని వాపోతున్నారు.

ఇప్పటికే 25 వేల మంది నుంచి పైసలు వసూలు చేసి ఉంటారని, ఆ లెక్కన రూ. 100 కోట్లు వసూలు చేశారని వారు అంటున్నారు. ఇలా పేదల నుంచి వసూలు చేసిన సొమ్మును నెల్లూరులో ఇన్వెస్ట్​ చేశారని వారు చెప్పడం గమనార్హం. మియాపూర్, కూకట్‌పల్లి, బాలాపూర్ ప్రాంతాల నుంచి 5 వేల మందికి పైగా ఉన్నారని , ఈ విషయంలో ఎక్కువ సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుని నగరంలోని పేదలు ముఖ్యంగా స్లమ్​ప్రాంతంలోని ముస్లిం ప్రజలే టార్గెట్‌గా ప్లాట్లు అమ్మారని చెప్పారు. సదరు ఏజెంట్లు తమ బంధువులు అయినందువల్లే మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్కే జిలానీకి చెందిన ఆఫీసులో గిఫ్ట్, సేల్, నోటరీ ఫేక్​డాక్యుమెంట్లు గుట్టలుగా ఉన్నాయని వారు చెప్పడం గమనార్హం.

న్యాయం చేయండి సారూ..

మియాపూర్​, బాలాపూర్, కూకట్​పల్లి ప్రాంతాలకు చెందిన బాధితులు నాగలక్ష్మి, లావణ్య, జ్యోతి, కవిత సోమవారం వనస్థలిపురం పోలీస్​స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేశారు. తమ సొంత బంధువుల మాటలు విని మోసపోయామని, రూ.35 వేలు ఇస్తే డాక్యుమెంట్లు ఇచ్చారని ఫేక్​నోటరీ డాక్యు‌మెంట్లు చూపించారు. ఏదేమైనా తమకు న్యాయం చేయండి సారు.. అంటూ వారు పోలీసులను వేడుకున్నారు.

ఆచితూచి వ్యవహరిస్తున్న పోలీసులు..

అయితే ఈ విషయంలో వేలాది సంఖ్యలో బాధితులు ఉండడం అందులో.. సగానికి పైగానే ముస్లిం జనాభా ఉండడం కొంత సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సొంత గూడు ఆశతో పైసా పైసా పోగేసి ప్లాట్ల కోసం పైసలు కట్టిన వేల మంది పేదల పైసలు ఇప్పించేందుకు, ఏదేమైనా అక్రమార్కులను త్వరలోనే అరెస్ట్​ చేస్తామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.

Next Story

Most Viewed