- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాత లోన్ రాదు.. కొత్త లోన్‌కు అర్హత లేదు..ఆ స్కీమ్‌లో తలెత్తిన సమస్యలు..!

దిశ,దుమ్ముగూడెం: నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాస్’ పథకం ఇప్పుడే వివాదాస్పదంగా మారింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో అనేక మంది నిరుద్యోగ యువత సాంకేతిక సమస్యలు,పాత రికార్డుల సమస్య వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.దుమ్ముగూడెం మండలం లో అనేక మంది నిరుద్యోగులు యువజన వికాస్ పథకానికి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే క్రమంలో ఓబి ఎంఎంఎస్ పోర్టల్ లో "ఈ ఆధార్ ఇప్పటికే ఉంది" అనే సందేశం ఎదురవుతోంది.
ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెనిఫిషియరీ ఐడీ ద్వారా ఇప్పటికే ఆధార్ నెంబర్ రిజిస్టర్ అయింది కాబట్టి కొత్తగా దరఖాస్తు చేయలేరని సమాచారం వస్తోంది. అసలు కారణం ఏమిటి అని పరిశీలించినట్లయితే, గతంలో ఎస్సీ కార్పొరేషన్ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా లోన్ లేదా ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసిన వారికి ఈ సమస్య తలెత్తుతోంది. ప్రభుత్వం యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని ప్రకటించినప్పటికీ, పాత రికార్డుల కారణంగా కొత్త పథకాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై బాధిత యువత మండల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించగా,పై స్థాయి నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెప్పినట్లు సమాచారం.
ఏప్రిల్ 5 గడువు సమీపిస్తోంది.. పరిష్కారం లేనిదే అనేక మందికి లబ్ధి ఆగిపోతుందా?
దరఖాస్తు గడువు ఏప్రిల్ 5 సమీపిస్తున్న నేపథ్యంలో, సాంకేతిక లోపాల కారణంగా వేలాది మంది నిరుద్యోగ యువత నష్టపోతున్నారు. "ఈ ఆధార్ ఇప్పటికే ఉంది" అనే సమస్యతో అనేక మంది దరఖాస్తు చేసుకోలేక పోతుండటంతో, పథకానికి అర్హులైన వారు కూడా లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా ఏప్రిల్ 5, అప్పటిలోగా సమస్యను పరిష్కరించకపోతే, పథకానికి అర్హులైన వారు కూడా లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది.
సాంకేతిక లోపాలను సరి చేయాలి : మారెళ్ళ కిరణ్ (నిరుద్యోగ యువత)
వికాస్ పథకంలో సాంకేతిక లోపాల కారణంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో 'ఈ ఆధార్ ఇప్పటికే ఉంది' అనే సమస్య తలెత్తుతోంది. పాత డేటా కారణంగా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం అసాధ్యమవుతుంది. అధికారులను సంప్రదిస్తే ఇప్పటి వరకు మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే సాంకేతిక లోపాలను పరిశీలించి, దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.