Cyber Crime: మస్క్ పేరుతో మాజీ పైలట్‌‌కు మస్కా.. ఏకంగా రూ.74 లక్షలకు కుచ్చుటోపీ

by Shiva |   ( Updated:2025-03-22 09:05:36.0  )
Cyber Crime: మస్క్ పేరుతో మాజీ పైలట్‌‌కు మస్కా.. ఏకంగా రూ.74 లక్షలకు కుచ్చుటోపీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. అమాయక జనం నుంచి కార్పొరేట్ సంస్థలను కూడా బురిడి కొట్టిస్తూ సులువుగా డబ్బు సంపాదించేందుకు విచ్చలవిడిగా మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్‌ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk) పేరుతో సైబర్ కేటుగాళ్లు రూ.లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన మాజీ పైలట్ (65) కొన్నాళ్ల నుంచి ‘X’ (ట్విట్టర్‌)లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎలాన్ మస్క్ కుటుంబ సభ్యులు, తల్లి పేరుతో ఉన్న ‘మేయే మస్క్ ఎక్స్‌ ఆఫీషియల్స్’ (Maye Musk Ex-Officials), ‘ఇయామ్ అన్నా షెర్మాన్’ (I am Anna Sherman) నకిలీ ‘X’ సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన ఖాతాలను ఫాలో కొట్టాడు. ఈ క్రమంలోనే కేటుగాళ్లు మాజీ పైలట్‌ను తమ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని మెసేజ్ పంపారు. తక్కువ డబ్బుతో ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని నమ్మించారు. అది నిజమేనని నమ్మిన పైలట్ ఏకంగా రూ.72 లక్షలు విడతల వారీగా సైబర్ నేరగాళ్ల అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. వారం గడిచినా.. అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story

Most Viewed