BIG News: తహశీల్దార్లకు ఇక ‘సూపర్’ పవర్స్..!

by Shiva |   ( Updated:2024-08-16 15:09:57.0  )
BIG News: తహశీల్దార్లకు ఇక ‘సూపర్’ పవర్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రెవెన్యూ’లో అధికార వికేంద్రీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే గత మార్చి లో మండల, డివిజన్ స్థాయిలో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ‘ఆర్ఓఆర్-2024’ డ్రాఫ్ట్ బిల్లులోనూ ‘ప్రిసైబ్డ్ ఆఫీసర్స్’ అనే ప్రస్తావన తీసుకొచ్చింది. దీని ద్వారా సాధ్యమైనంత ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు తహశీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న ప్రభుత్వం.. అనేక సందేహాలకు సమాధానాలిస్తూనే, సవరణలు కూడా చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయి గైడ్ లైన్స్ రూపొందించిన తర్వాతే ఏ అధికారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై స్పష్టత రానున్నది.

‘ధరణి’తో జఠిలంగా మారిన పరిష్కారం

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత భూ సమస్యల పరిష్కారం జఠిలంగా మారింది. పేరులో అక్షరం తప్పు పడినా, ఇంటి పేరు తప్పుగా వచ్చినా, ఆధార్ నంబర్ రాంగ్ వచ్చినా.. అన్ని సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ లోని సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్ఐ మొదలుకొని తహశీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ వరకు అందరినీ కన్విన్స్ చేయాల్సి వచ్చేది. ఏ ఒక్కరినీ మెప్పించలేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేది. సమస్య పరిష్కారానికి నెలలు, సంవత్సరాలు పట్టేది. ‘ఆర్ఓఆర్-2020’లో అధికారాలను కేంద్రీకృతం చేయడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కిందిస్థాయి అధికారులను రిపోర్టులు రాసి పంపడం వరకే పరిమితం చేశారు.

చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే గైడ్‌లైన్స్

ఆర్ఓఆర్-2024 అమలులోకి వచ్చిన తర్వాతే ప్రతి సెక్షన్ లో పేర్కొన్న అంశాలపై పని చేసేందుకు ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్లను ప్రకటించనున్నారు. ఏ అధికారి, ఏ పనులు చేయాలన్నది గైడ్ లైన్స్ ద్వారానే స్పష్టత ఇవ్వడం సాధ్యమవుతుందని చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భూమి సునీల్ ‘దిశ’కు వివరించారు. ఇప్పటికే ప్రకటించిన సర్క్యులర్ ఒక దానికి చట్టబద్ధత కల్పించనున్నట్లు చెప్పారు. అందులో చాలా వరకు తహశీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు కట్టబెట్టారు. కొన్నింటిని కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో పేర్కొన్నారు. వాటిలోనూ సాధ్యమైనన్ని అంశాలను తహశీల్దార్లకే కట్టబెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఈ మేరకు సర్క్యూలర్ ను సవరించడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశ్యం ఉందన్నారు. దీని ద్వారా మండల స్థాయి అధికారులకే సూపర్ పవర్స్ ఉంటాయని తెలుస్తున్నది.

చట్టంలో చెబితే సమస్యే..

ఏ పనిని ఎవరు చేయాలి? ఎంత కాలంలో చేయాలి? ఇలాంటి అంశాలను చట్టంలో పేర్కొనలేదు. అలా చెప్పడం నష్టదాయకమనే అభిప్రాయమున్నది. రికార్డుల నిర్వహణ, చేర్పులు/మార్పుల బాధ్యతలను చట్టంలో ప్రిస్క్రైబ్డ్ అధికారులతో అనే ఉంటుంది. అక్కడ తహశీల్దార్/ఆర్డీవో అని పేర్కొంటే మార్చుకోవాలంటే మళ్లీ చట్ట సవరణ అనివార్యంగా మారుతుంది. అందుకే ఈ అంశాలను మార్గదర్శకాల ద్వారానే వెల్లడిస్తారు. ప్రస్తుతం భూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే మండల స్థాయిలోనే మ్యాగ్జిమమ్ పరిష్కారం కావడం వల్ల సామాన్యులకు న్యాయం దక్కుతుంది. దూరాభారం, ఖర్చులు తగ్గుతాయి. అలాగే అవసరమైన సందర్భాల్లో అధికారులను, ఉద్యోగులను కలిసే వీలుంటుంది. అప్పీల్ వ్యవస్థ కూడా ఎలా ఉంటుందన్న అంశంపైనా గైడ్ లైన్స్ ద్వారా స్పష్టత రానున్నది. అప్పీల్ కి ఎక్కడికి వెళ్లాలి? రివిజన్ పిటిషన్ ఎక్కడ దాఖలు చేయాలి? ఇలాంటి అనేక ప్రశ్నలకు గైడ్ లైన్స్ ద్వారా మరింత క్లారిటీ రానున్నది.

ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్స్!

  • ది హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్, 1948లో రికార్డుల నిర్వహణ బాధ్యత ఎవరు చేపట్టాలనే అంశాన్ని సెక్షన్ 4‌లో పేర్కొన్నారు. అందులోనూ ల్యాండ్ హోల్డర్స్, యజమానులు, ఆక్యుపెంట్స్, మార్ట్ గేజెస్, అసైనీ, నేచర్ ఆఫ్ ల్యాండ్, విస్తీర్ణం వంటి చేర్పులు, మార్పుల బాధ్యతను నిర్దిష్ట అధికారులు చేస్తారన్నారు. కానీ ఏ స్థాయి అధికారి అనేది లేకుండానే ప్రిస్క్రైబ్డ్ అని స్పష్టం చేశారు.
  • ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాసు బుక్స్ యాక్ట్, 1971 సెక్షన్ 3లో ప్రిస్క్రైబ్డ్ అధికారుల చేతనే రెవెన్యూ రికార్డులను మెయింటెయిన్ చేస్తారని పేర్కొన్నారు. యజమానులు, పట్టాదారులు, మార్ట్ గేజెస్, కబ్జాదారులు, కౌలుదారులు వంటివి కూడా వారే రాస్తారని ఉంది. నేచర్ ఆఫ్ ల్యాండ్, విస్తీర్ణం వంటి అంశాలు కూడా ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ చేస్తారని పేర్కొన్నారు. కానీ ఏ అధికారి అనేది ఇవ్వలేదు.
  • తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాసు బుక్స్ యాక్ట్, 2020 సెక్షన్ 3 లో రెవెన్యూ రికార్డుల నిర్వహణ, అప్ డేషన్ వంటి అధికారులను నిర్దిష్ట అధికారులు చేస్తారనే ఉంది. ఇక్కడ కూడా ఎవరనేది చెప్పలేదు. ప్రిస్కైబ్డ్ అనే పదంతోనే ముగించారు.
  • ఆర్వోఆర్ యాక్ట్ -2024 ముసాయిదా సెక్షన్ 4 లోనూ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఏ అధికారి, ఎంత కాలంలో చేస్తారన్న దానికి ప్రిస్కైబ్డ్ అనే పదంతోనే ముగించారు.
  • మిగిలిన చాలా రెవెన్యూ చట్టాల్లో ఏయే పనులను ఏ అధికారి చేయాలన్న దానికి స్పష్టత ఇవ్వలేదు.
  • ప్రతి చట్టం అమలుకు ప్రత్యేకంగా రిలీజ్ చేసే గైడ్ లైన్స్ లోనే అధికారాలను కట్టబెడతారు. ఏ అధికారి, ఏ పని చేయాలి? ఎంత కాలంలో చేయాలి? అప్లికేషన్ల విధానం ఏంటి? ఇవన్నీ మార్గదర్శకాల్లోనే ఉంటుంది.
Advertisement

Next Story