BIG News: తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు..! ‘స్థానిక’ ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయం

by Shiva |
BIG News: తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు..! ‘స్థానిక’ ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోనూ టీడీపీ బీజేపీతో పొత్తుతో వెళ్లాలని యోచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీకి గ్రామస్థాయి నుంచి కేడర్ ఉండటంతో పోటీచేస్తే తిరిగి పునర్ వైభవం తేవాలని భావిస్తుంది. బీజేపీకి యువత ఆదరణ ఉండటంతో కలిసి వస్తుందని మెజార్టీ స్థానాల్లో విజయం సాధించొచ్చని భావిస్తూ అడుగులు వేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ లీడర్లకు అధినేత చంద్రబాబు పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టు సమాచారం. పొత్తుపై త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నది.

ఏపీ ఫార్ములా తెలంగాణలోనూ..

తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో పునర్ వైభవం తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే రాబోయే అన్ని ఎన్నికల్లో పొత్తులతో వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ అధినేత చంద్రబాబు ఆశిస్తున్నారు. ఏపీలో పొత్తుతోనే ఘన విజయం సాధించడం, అదే ఫార్ములాను తెలంగాణలోనూ కొనసాగిస్తామని పార్టీ నేతలకు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో బీజేపీతో కలిసి పోతామని సంకేతం ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే రాబోయే స్థానిక సంస్థలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలుస్తుందని నేతలతో బాబు పేర్కొన్నట్టు సమాచారం.

పార్టీ లీడర్ల అభిప్రాయం మేరకు పోటీపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసి రెండు ఎమ్మెల్యే స్థానాలను సైతం గెలుచుకున్న తర్వాత రాష్ట్రంలో నాయకత్వం లోపంతో ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏదో ఒకపార్టీకి మద్దతు తెలుపుతూ వస్తుంది. పార్టీ అధిష్టానం స్పష్టంగా ఏ పార్టీకి మద్దతు అని చెప్పకపోవడంతో స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నేతలు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అయితే ఈసారి తెలంగాణపై అధినేత బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

టీడీపీకి గ్రామస్థాయిలోనూ కేడర్ ఉంది. నాయకత్వం లోపించడంతో స్తబ్దుగా ఉంది. ఇప్పటికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను సైతం నిర్వహిస్తున్నారు. బీజేపీకి సైతం ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ వస్తున్నది. యువత ఎక్కువగా ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో కలిసి పనిచేస్తే తెలంగాణలోనూ మెజార్టీ స్థానాలు సాధించొచ్చని, పార్టీకి పునర్ వైభవం తీసుకురావడంతో పాటు బీజేపీకి సైతం కలిసి వచ్చే అవకాశం ఉందని బాబు భావిస్తున్నట్టు సమాచారం.

అందుకే కలిసి పనిచేయాలని బీజేపీ కేంద్రపార్టీ సైతం ఇదే అభిప్రాయాన్ని చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బీజేపీ బలోపేతం అవుతుందని, అది టీడీపీకి సైతం కలిసి వస్తుందని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పొత్తులపై క్లారిటీ ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నేతలకు తెలిపినట్టు తెలిసింది.

నేతలకు క్లాస్..

తెలంగాణలోని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం వినతిపత్రాలు ఇవ్వడంపై సీరియస్ అయినట్టు తెలిసింది. నేతలంతా కేవలం ఎన్టీఆర్ భవన్‌కు పరిమితం అయ్యారని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా పార్టీని బలోపేతంపై దృష్టిసారించకుండా భవన్‌కు వస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం. ఎవరెవరూ ఏం చేస్తున్నారో తనకు తెలుసని, అందరి వివరాలు తనవద్ద ఉన్నాయని, పైరవీలకు, వినతులకు పదవులు రావని హెచ్చరించినట్టు సమాచారం.

ఆన్‌లైన్ మెంబర్ షిప్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని, లీడర్ల పనితీరును బట్టి, ప్రజాభిప్రాయం మేరకే పదవులు ఇస్తానని స్పష్టం చేసినట్టు తెలిసింది. తనకు ఏదో చెప్పితే నమ్మబోనని, పనిచేసేవారికే పార్టీ బాధ్యతలు అంటూ పేర్కొన్నట్టు సమాచారం. లీడర్ల మధ్య అభిప్రాయాలు భేదాలు ఉన్నాయని, వాటిని మానుకొని ప్రజల్లోకి వెళ్లాలని, నిత్యం నేతల పనితీరును గమనిస్తున్నట్టు హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. ప్రతి నెల రెండో శనివారం భవన్‌కు వస్తానని, పార్టీపై రివ్యూ చేస్తానని చెప్పడంతో పాటు నేతలంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు.

Advertisement

Next Story