BIG News: కొనసాగుతోన్న ‘హైడ్రా’ జోరు.. జన్వాడ కట్టడాలను కూల్చొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు

by Shiva |   ( Updated:2024-08-21 06:11:15.0  )
BIG News: కొనసాగుతోన్న ‘హైడ్రా’ జోరు.. జన్వాడ కట్టడాలను కూల్చొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్‌ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా నెలకొల్పిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమార్కులు, కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్‌ను మొదలు పెట్టిన ఆ సంస్థ నగర శివార్లలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను బోల్డోజర్లతో నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జన్వాడలో కట్టడాలను కూల్చొద్దంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత ప్రదీప్‌‌రెడ్డి కూల్చివేతలపై వెంటనే స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఉస్మాన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో తన ఫాంహౌజ్ లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 14న తన ఫాంహౌజ్‌ను నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. రాజకీయ కారణాలతోనే తన ఆస్తికి నష్టం చేకూర్చాలని చూస్తున్నారని ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన వేసిన పిటిషన్‌పై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషన్‌ రంగనాథ్, రంగారెడ్డి కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్‌పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీన్లను పిటిషనర్ చేర్చారు.

పక్కా లెక్కలతో హైడ్రా దూకుడు

జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 60 శాతం వరకు చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లుగా హైడ్రా అధికారులు పక్కాగా లెక్కలు తేల్చారు. అక్రమ నిర్మాణాల నిర్మూలనే ధ్యేయంగా హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ డివిజన్ వైశాలి నగర్‌లో ఎఫ్టీఎల్‌లో నిర్మించిన మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. అదేవిధంగా గాజులరామారం, రాజేంద్రనగర్ శాస్త్రిపురం, మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంటలో మిగతా చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్లింది. పొలిటికల్‌ ఒత్తిళ్లకు తావు లేకుండా కమిషన్ రంగనాథ్ టీం ఎక్కడికక్కడ ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed