BIG News: కవిత చుట్టే బీఆర్ఎస్..? కేసు విచారణకు వచ్చిందంటే ఢిల్లీకి నేతలు

by Shiva |
BIG News: కవిత చుట్టే బీఆర్ఎస్..? కేసు విచారణకు వచ్చిందంటే ఢిల్లీకి నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవిత చుట్టే బీఆర్ఎస్ రాజకీయం నడుస్తోంది. ఆమె బెయిల్ కోసం పార్టీ ఎదురుచూస్తోంది. కోర్టులో కేసు విచారణకు వచ్చిందంటే చాలు.. పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపడుతున్నారు. ఆమె కేంద్రంగా రాజకీయం నడపాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ సైతం బెయిల్ తర్వాతనే జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచార అస్త్రంగా కవిత ఎపిసోడ్‌ను వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

158 రోజులుగా జైలులోనే కవిత

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. 158 రోజులుగా జైలులోనే ఉన్నారు. విచారణ ఉన్నప్పుడు కోర్టుకు తీసుకురావడం, తిరిగి తరలించడం జరుగుతోంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం‌కు బెయిల్ రావడంతో కవిత సైతం బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతున్నది. కవితపై బీఆర్ఎస్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆమె కేసు విచారణ జరుగుతుందంటే చాలు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు ఢిల్లీకి వెళ్తున్నారు. మొన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వెళ్లి రాగా, తాజాగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ వెళ్లారు. వెళ్లిన నేతలంతా కవితతో భేటీ అయి కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసు వాదిస్తున్న న్యాయవాదులతో భేటీ అయి కేసు పూర్వపరాలు తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరిస్తున్నారు. పార్టీ కంటే ఎక్కువగా కవితపైనే దృష్టి సారించినట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

బెయిల్ వచ్చాకే పార్టీ ప్రోగ్రామ్స్ స్పీడప్!

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేయాలని పార్టీ అధినేత భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ సైతం అప్పుడే జనంలోకి వస్తారని, ప్రజలకు సైతం అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. పార్టీని సైతం క్షేత్రస్థాయిలో బలోపేతానికి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దృష్టంతా బెయిల్ మీదనే పెట్టినట్టు పార్టీ వ్యవహరిస్తున్న వైఖరే స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో కవిత కేంద్రంగానే రాజకీయాలకు పార్టీ శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ ఫ్యామిలీపై కేంద్రం కక్ష సాధింపు!

త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం సైతం కసరత్తును ప్రారంభించింది. అయితే కవితను లిక్కర్ కేసులో ఆరోపణలతో అరెస్టు చేశారని, ఆమెకు జరిగిన అన్యాయం యావత్ మహిళా లోకం జరిగిన అన్యాయమని, ఒక మహిళను ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని, ఇది బీఆర్ఎస్‌పై, కేసీఆర్ కుటుంబంపై కేంద్రం కక్షసాధింపు చర్యగా పేర్కొంటూ ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమకాలంలో జాగృతి పేరుతో, బతుకమ్మ పేరుతో ఉత్సవాలు నిర్వహించి చైతన్య పరిచారని, అదే విధంగా సేవాకార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృత పరిచారని.. అలాంటి కవితను బద్నాం చేయాలనే కక్షతో అరెస్టు చేశారని, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన ఘటనలను ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. కవిత ఘటనను యావత్ తెలంగాణ మహిళాలోకం ఖండించాలని, బాసటగా నిలువాలని, తెలంగాణపై కేంద్రం దాడిని అడ్డుకోవాలంటే కలిసి రావాలని, మద్దతుగా నిలవాలని అభ్యర్థించనున్నట్టు సమాచారం.

విమర్శల నేపథ్యంలో ఢిల్లీకి దూరంగా కేటీఆర్?

కవిత కేసు విచారణకు వచ్చినప్పుడల్లా కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి బీజేపీ లీడర్లతో భేటీ అవుతున్నారని, బీఆర్ఎస్ రాజ్యభస సభ్యులను బీజేపీలో విలీనం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ సైతం సొంత చెల్లెలు తిహార్ జైలులో ఉంటే.. ఢిల్లీలో బేరసారాలు చేశారని కేటీఆర్‌పై విమర్శలు చేశారు. దీనిపై కేటీఆర్ ప్రతి విమర్శలతో పాటు విలీనంపై వస్తున్న వార్తలను ఖండించారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లెలు ఢిల్లీలో ఉంటే వెళ్లొద్దా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి ఆరోపణలు వస్తుండటంతోనే మంగళవారం సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉన్నప్పటికీ కేటీఆర్ వెళ్లకుండా లీడర్లను ఢిల్లీకి పంపించారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed