Bhu Bharathi: ఫ్యూచరిస్టిక్ యాక్ట్ ‘భూ భారతి’.. ఆర్వోఆర్-2024 ఆమోదంతోనే హాఫ్ విక్టరీ

by Shiva |
Bhu Bharathi: ఫ్యూచరిస్టిక్ యాక్ట్ ‘భూ భారతి’.. ఆర్వోఆర్-2024 ఆమోదంతోనే హాఫ్ విక్టరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రాష్ట్రంలో భూ సమస్యలు, రైతుల బాధలు, అధికార యంత్రాంగం తీరు నాకు తెలుసు. స్వాధీనంలో భూమి, రికార్డులో పేరు, చేతిలో పట్టా ఉంటేనే భూమి హక్కులకు భద్రత. అందుకే రైతు కోణంలో ఆలోచించి భూ భారతి (ఆర్వోఆర్-2024) చట్టాన్ని రూపొందించాం’ అని రెవెన్యూ చట్టాల నిపుణుడు, రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ అన్నారు. అందుకే 24 డ్రాఫ్టుల తర్వాత చట్టం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ‘చాలా జూనియర్. ఆయనకేం తెలుసు. అనుభవమే లేదు అని చాలా మంది విమర్శించారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడే నల్సార్ యూనివర్సిటీలో చెరువుల పరిరక్షణకు ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని రూపొందించిన నైపుణ్యం నాకు ఉంది’ అని చెప్పారు. 22 ఏండ్లుగా భూమి కేంద్రంగానే పని చేస్తుండడంతో సునీల్ కుమార్ ఇంటి పేరే భూమిగా మారింది. ఇప్పుడు ఆయన భూమి సునీల్ గా ప్రసిద్ధి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ‘లా’స్ అంశాల్లో ఆయన పేరు చిరపరిచయం. ఆయన నేతృత్వంలోనే ఆర్వోఆర్ యాక్ట్-2024 తయారైంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో భూమి సునీల్ ‘దిశ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆర్వోఆర్-2024 ఆమోదించారు.. ఎలా ఫీల్ అవుతున్నారు?

సునీల్: చాలా సంతోషంగా ఉంది. నేను చాలా చట్టాలు తయారు చేశాను. కానీ ఇందులో ఒక ఫీల్ ఉంది. రైతులకు న్యాయం చేయాలన్న కోణంతో పని చేశాను. ఎన్ని అవరోధాలు, అవాంతరాలు ఎదురైనా ఫీల్ కాలేదు. భూ యజమానులకు మేలు కలిగించే విధంగా చట్టం రూపొందించాం. ఈ క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రెటరీ వి.లచ్చిరెడ్డిలకు కూడా దక్కుతుంది.

చాలా చట్టాల తయారీలో మీ పాత్ర ఉంది. మీరు బాగా కష్టపడింది ఎక్కడ?

సునీల్: కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న అనేక చట్టాల తయారీలో నేను ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా భాగస్వామిని. ఆఖరికి నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు ప్రతిపాదించిన చట్టాల్లోనూ నేను ఉన్నాను. ఉదాహరణకు నీతి ఆయోగ్ కోసం కౌలుదారు చట్టం నమూనాను ఇచ్చాను. అది కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఏపీలోనూ దాన్ని కాస్త మార్చుకొని ల్యాండ్ లీజింగ్ యాక్ట్ గా అమలు చేస్తున్నారు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకునేందుకు వీలుగా కార్డులు ఇవ్వాలని చెప్పాం. ఏపీలో చుక్కల భూముల పరిష్కారానికి సరికొత్త మార్గాన్ని రూపొందించాం. దాంతో చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యాయి.

మహిళా రైతుల కోసం కూడా చట్టం చేశారా?

సునీల్: అవును. దేశంలో ఎక్కడా లేని విధంగా 2012లో స్వయం సహాయక గ్రూపు మహిళలు గ్రూపుగా వ్యవసాయం చేసుకునేందుకు ఎస్ హెచ్ జీ మహిళల కౌలుదారు చట్టాన్ని రూపొందించాను. అది ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఆ తర్వాత ఫాలో అప్ చేయకపోవడం వల్ల పెండింగులో ఉంది. నిజానికి అది మోస్ట్ ఎంపవర్మెంట్ చట్టం. ఇన్నోవేటివ్ ఐడియా అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ప్రశంసించారు. ఇప్పటికీ అమలు చేసేందుకు అనువుగా ఉన్న చట్టమే. చాలా సంతృప్తినిచ్చింది.

మీరు చాలా మంది సీఎంలతో కలిసి పని చేశారు కదా. కేసీఆర్ తో కలిసి చేయలేదా?

సునీల్: ప్రత్యక్ష్యంగా చేయలేదు. కానీ చాలా ప్రతిపాదనలు సమర్పించాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న 124 చట్టాలను అధ్యయనం చేశాం. రాష్ట్రం విడిపోయిన గరిష్టంగా రెండేండ్లల్లో కొత్త చట్టాలను రూపొందించుకోవాలి. లేదంటే అడాప్ట్ చేసుకోవడం తప్పనిసరి. తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా ఏయే చట్టాలను తీసుకోవాలన్న దానిపై నల్సార్ యూనివర్సిటీకి బాధ్యతలు అప్పగించారు. ఆ స్టడీ నా ఆధ్వర్యంలోనే జరిగింది. సుమారు వంద మంది నాతోపాటు పాల్గొన్నారు. సమగ్రమైన రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించాను. ఏ చట్టం అవసరం లేదు? ఏయే చట్టాలు అడాప్ట్ చేసుకోవాలి? అనే అంశంలో నా పాత్రనే ఉన్నది. ఆ రిపోర్ట్ ఆధారంగానే 2016లో చట్టాలను అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా జీవోలు జారీ చేశారు.

జైరాం రమేశ్‌తో అనుబంధం బాగా ఉన్నట్లుంది?

సునీల్: అవును. ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భూ సేకరణ చట్టం-2013 అమల్లోకి వచ్చింది. ఆ చట్టాన్ని తయారు చేయడానికి ఎంతో శ్రమించాం. పలు రాష్ట్రాల్లో స్టడీ చేశాం. ఆ తర్వాత కూడా అనేక అంశాల్లో కలిసి పని చేశాను. అందుకే అనుబంధం ఎక్కువ. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ హయాంలో రూపొందించే చట్టాల రూపకల్పనలో పాల్గొంటున్నాను.

అన్ని చట్టాల కంటే ఏది కష్టతరమనిపించింది?

సునీల్: ఇదే.. భూ భారతి. ఏడాదిగా నిరంతరం శ్రమించాను. నా ప్రాక్టీస్ ను, సొంత పనులను పక్కనపెట్టి ప్రజల కోసం, ప్రభుత్వం కోసం ఉచితంగా నా సేవలను అందించాను. వందలాది మందితో ప్రత్యక్ష్యంగా మాట్లాడాను. పలు గ్రామాల్లో పర్యటించాను. లీఫ్స్ సంస్థ ద్వారానూ అనేక న్యాయ శిబిరాలు పెట్టి సమస్యలను అధ్యయనం చేశాను. రైతులను ప్రత్యక్షంగా కలుసుకోవడం, అంతకు ముందు నా అనుభవం.. అంటే రైతుగా, లాయర్ గా, అధికారిగా, చట్టాల నిపుణుడిగా పని చేయడం ద్వారానే అన్ని వర్గాలను మెప్పించే చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురాగలిగాను.

భూ భారతిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం అన్నారు? (బాక్స్)

సునీల్: ఈ చట్టం తయారీలో ఆయన కమిట్మెంట్ ఉంది. ప్రజలకు మేలు కలిగించాలన్న ఆయన తపనే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అన్ని రకాలుగా సహకరించారు. చట్టం రూపకల్పనలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీసీఎల్ఏ అసిస్టెంట్ కార్యదర్శి వి.లచ్చిరెడ్డి భాగస్వామ్యం ఉంది. అన్నింటి కంటే రైతుగా, రైతు ప్రతినిధిగా, పదేండ్లపాటు భూమి మీద పని చేసిన కోదండరెడ్డి లేకపోతే ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఆయన ఆ వయసులో కూడా రైతులకు మేలు చేసే చట్టాన్ని తీసుకురావాలన్న లక్ష్యం మమ్మల్ని ఇన్ స్పైర్ చేసింది.

చట్టాన్ని తయారు చేసేటప్పుడు మీరు చూసే పారామీటర్స్ ఏంటి?

సునీల్: తొమ్మిది, పది కోణాల్లో చూడాలి. అందులో ప్రతి చట్టం ఇంప్యాక్ట్ ని అంచనా వేయాలి. ప్రధానంగా ఆ చట్టం స్టేక్ హోల్డర్ ప్రయోజనాలే ముఖ్యం. ఆర్వోఆర్ యాక్ట్ తీసుకుంటే స్టేక్ హోల్డర్స్ భూ యజమానులే. ఇందులో సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఎఫెక్ట్ ని పరిశీలించాలి. అలాగే భూత, వర్తమాన, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం వల్లే భూదార్, మ్యాప్, సర్వే వంటివి వచ్చాయి. ఇందులో ఎవరి వ్యక్తిగత అంశాలు చూడొద్దు. నేను లాయర్ ను కదా.. నాకు కేసులు వచ్చేటట్లుగా చేస్తే సరైంది కాదు. రాగద్వేషాలు ఉండొద్దు. కొందరి ఇగోలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తే వారి ప్రయోజనాలు నెరవేరుతాయి. స్టేక్ హోల్డర్స్ కు లబ్ది చేకూరేలా ఉండడమే అంతిమ లక్ష్యం.

మీకు స్ఫూర్తి ఎవరు?

సునీల్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి స్ఫూర్తి. ఇది తయారయ్యిందంటే వారిద్దరే కారణం. డ్రాఫ్టింగులో బాగా సహకరించింది సీసీఎల్ఏ నవీన్ మిట్టల్. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా స్ఫూర్తి. ఆయన పోరాట పటిమ మామూలు కాదు.

ఆర్వోఆర్-2024లో భూ సమస్యలు పరిష్కారమవుతాయా? (బాక్స్)

సునీల్: దీని ద్వారా 80 శాతం ఇష్యూస్ సాల్వ్ చేయొచ్చు. భూ సమస్యల్లో ఆర్వోఆర్ కి సంబంధించి 80 శాతం, పీవోటీ 10 శాతం, ఇనాం, టెనెన్సీ 5 శాతం, ఇతర సమస్యలు 5 శాతం ఉంటాయి. ఇదేం సర్వరోగ నివారిణి కాదు. అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కారమవుతాయా అని అడిగితే.. ఈ చట్టానికి సంబంధమే లేదు. ఇది రికార్డ్ ఆఫ్ రెవెన్యూ అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. అన్ని సమస్యలకు ఇదే సర్వరోగనివారిణిగా మాట్లాడుతుంటారు. అలాగైతే 124 చట్టాలు ఎందుకు ఉంటాయి? అందులో ఇదొక్కటి. అయితే దీని పాత్రే అధికం.

చట్టం అమలు కష్టమే అంటున్నారు? (బాక్స్)

సునీల్: ఏ చట్టమైనా రూపొందించి, ఆమోదించడంతో హాఫ్ విక్టరీ. ఇప్పుడే నేను అంతా అయిపోయిందనడం లేదు. దీని అమలు అంతే ప్రధానం. ఆర్నెళ్ల నుంచి ఏడాది దాకా గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టాలి. అంతకు ముందే రూల్స్ ఫ్రేం చేయడం అత్యంత ప్రధానం. అది చేయకపోతే చాలా కష్టం. ఆర్వోఆర్-1971 యాక్ట్ ఓ ఉదాహరణ. అమల్లోకి వచ్చిన దానికి, రూల్స్ చేసిన దానికి మధ్య కొన్నేండ్లు పట్టింది. ఇప్పుడు మూడు నెలల్లో చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఏ చట్టమైనా తానంతట తానుగా ఉపయోగపడదు. ఉపయోగించే ప్రక్రియను చేపట్టాలి.

పేదలకు న్యాయం సాయం ఆలోచన ఎలా వచ్చింది?

సునీల్: ప్రపంచంలో పేదలకు న్యాయ సాయం అందించాలనే అంశాన్ని చట్టంలో పేర్కొనడం ఇదే ప్రథమం. అందుకే జాతీయ స్థాయిలో పని చేస్తున్న నిపుణులు ప్రశంసించారు. లీగల్ అథారిటీలు ఉండొచ్చు. కానీ రెవెన్యూ చట్టంలో పొందుపరిచి పేదల రైతుల కోణంలో ఆలోచించాను. ఈ రోజుల్లో న్యాయం పొందడం అంత ఈజీ కాదు. అయితే ఎలా దక్కుతుందో తెలుసుకోవడం కూడా కష్టమే. అందుకే ఈ వ్యవస్థను చట్టంలోనే పొందుపర్చడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలు కూడా ఆశ్చర్యపోయారు.

Advertisement

Next Story

Most Viewed