Bhatti Vikramarka: డీఎస్సీపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన

by Prasad Jukanti |   ( Updated:2024-09-05 12:35:37.0  )
Bhatti Vikramarka: డీఎస్సీపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజ అభివృద్ధిలో విద్య, గురువుల పాత్ర ఎంతో కీలకం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన భట్టి.. ప్రపంచంతో పోటీ పడేలా విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, విద్యా విధానంలో మార్పులను టీచర్లు స్వాగతిస్తారని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కొంత మంది వ్యతిరేకించే ప్రయత్నం చేసినా ఉపాధ్యాయులు మాత్రం స్వాగతించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ పాలనలో పాఠశాల్లో శానిటేషన్ ప్రక్రియ లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.120 కోట్లతో శానిటేషన్ పనులు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం చదివే చదువుకు చేసే పనికి పొందన లేకుండా పోతున్నదని, పరిశ్రమలకు పనికొచ్చే విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉందన్నారు. అందుకే ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. 63 ఐటీఐ సెంటర్లను ఏఐ సెంటర్లుగా మార్చబోతున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మొదట టీచర్ల గురించే ఆలోచించాం. 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, 11 వేల 62 మంది టీచర్ల కోసం డీఎస్సీ నిర్వహించామన్నారు. వారంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. త్వరలో మరో 6 వేల పోస్టులతో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. అమ్మా ఆదర్శ పాఠశాలలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు.

Advertisement

Next Story

Most Viewed