కమనీయంగా భద్రాద్రి రాముని కల్యాణం

by Sathputhe Rajesh |
కమనీయంగా భద్రాద్రి రాముని కల్యాణం
X

దిశ, భద్రాచలం : ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం. వేద పండితుల మంత్రోచ్ఛారణలు. శ్రీరామ జయ రామ అంటూ భక్తుల జయ జయ ద్వానాలు. ఎటు చూసినా భక్తజన సందోహం నుడుమ భద్రాద్రిలో రాములవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మిథిలా ప్రాంగణం కళ్యాణ శోభతో ఓలలాడింది. శ్రీరామచంద్రుడు కచ్చితంగా 12 గంటలకు శుభ ముహూర్తాన అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారిని పరిణయమాడారు. ఈ అపురూప సన్నివేశం వీక్షించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి.‌ ఆబాల గోపాలం మైమరిచిపోయింది.

వేద గోషతో భద్రగిరి పులకరించింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని మిధులా ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు.

అర్చక స్వాములు సాంప్రదాయ బద్ధంగా ఈ కళ్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. దేశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. ప్రభుత్వం భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కళ్యాణ మహోత్సవంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తప్ప మరే మంత్రి కూడా హాజరు కాకపోవటం గమనార్హం. ఇక ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కల్యాణానికి హాజరు కాలేదు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ దగ్గరుండి మరి ఈ కళ్యాణం ఏర్పాట్లను చూశారు.

Advertisement

Next Story

Most Viewed