- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘భయ్యా’ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇక వద్దు! నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్స్ హాట్ టాపిక్‌గా మారింది. వివిధ సమాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. ఫాలోవర్లను మోసం చేసి కొంత మంది అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. దీని ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లడం, చివరికి ప్రాణాలు తీసుకోవడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలిచ్చింది. గత నెలలో ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన లోకల్ బాయ్ నాని అనే పేరున్న యూట్యూబర్ పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు కేసు నమోదైంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న లోకల్ బాయ్ నాని వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోస్టు వైరల్ కావడంతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఎవరీ భయ్యా సన్నీ యాదవ్
తెలంగాణకు చెందిన పాపులర్ యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌పై సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతంకల్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. భయ్యా సన్నీ యాదవ్ ఫేమస్ మోటో వ్లాగర్. తన స్పోర్ట్స్ బైక్ పై వివిధ ప్రదేశాలను చుట్టొచ్చే వీడియోలను పోస్ట్ చేస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నూతనకల్‌కు చెందిన బయ్యా సన్నీ యాదవ్ వ్లాగ్స్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంటుంది. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత రైడింగ్ వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు. భయ్యా సన్నీ యాదవ్ కు 47.6 లక్షల మంది సబ్‌స్రైబర్‌లు ఉన్నారు. వివిధ ప్రాంతాలకు బైక్ మీద పర్యటనలు చేస్తూ 1400 వరకు వీడియోలు చేసిన సన్నీ యాదవ్ కు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది మరో ప్రముఖ తెలుగు యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ దీనిని బయటపెట్టాడు. అప్పట్లో ఇద్దరి మధ్య యూట్యూబ్ వేదికగానే తీవ్ర వాగ్వాదం జరిగింది.
వెలుగులోకి తెచ్చిన నా అన్వేషణ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వెలుగులోకి తెచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటగాడిగా అతడిని ఫాలోవర్లు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రపంచ దేశాలను తిరిగేస్తూ తన నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ దేశాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. అక్కడి విశేషాలను తెలియజేస్తాడు. దేశంలోనే అత్యధికంగా ట్రెండ్ అయ్యే వీడియోల్లో అన్వేష్ వీడియోలు ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసే మోసాలను.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మోసాలపై అతను ఎప్పటి నుంచో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ లాంటి ఎంతో మంది పాపులర్ యూట్యూబర్లతో తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. తాజాగా ప్రపంచ యాత్రికుడికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా చిట్ చాట్ సైతం చేశారు. వాటి నియంత్రణ కోసం ఇద్దరు కృషి చేస్తున్నారు. అయితే వీరిద్దరి చర్చ జరిగిన మరుసటి రోజు బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు కావడం విశేషం.
టీఎస్ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆర్టీసీ సంబంధించిన అంశాలతో పాటుగా.. రోడ్డు భద్రతా, సైబర్ క్రైమ్స్, సోషల్ అవేర్‌నెస్ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు వీడియోలు, ఫోటోలు ఎక్స్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా పోస్ట్ చేశారు. యూటుబర్లు లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ ప్రమోషన్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్టు చేస్తాం: సూర్యాపేట డీఎస్పీ
బయ్యా సన్నీ యాదవ్ ప్రొఫైల్‌ను చెక్ చేసిన పోలీసులు.. అతని ఖాతాలో చాలా వరకు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వీడియోలను గుర్తించి కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మార్చి 13న సూర్యాపేట జిల్లా డీఎస్పీ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సన్నీ యాదవ్ పై నూతన్ కల్ పీఎస్ లో కేసు నమోదు చేశాము. అతనిపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే సన్నీ యాదవ్ ను అరెస్టు చేస్తామని డీఎస్పీ రవి చెప్పుకొచ్చారు.
బెట్టింగ్ ప్రమోషన్‌లో సెలెబ్రిటీస్ సైతం!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. బెట్టింగ్ యాప్స్‌ను సెలెబ్రిటీస్ సైతం ప్రమోషన్ చేస్తున్నారని, మరి వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం యూట్యూబర్లపైనే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సెలబ్రిటీస్‌ను గుర్తించి కేసులు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయవద్దని నెటిజన్లు యూట్యూబర్లకు సూచిస్తున్నారు. డబ్బుల కోసం యువతను బలి చేయొద్దని, ఫాలోవర్లను వాడుకోని అడ్డ దారిలో సంపాదించడం తగదిని వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
నెక్స్ట్ ఎవరు?
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. యూట్యూబర్లు లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ కేసు నమోదుతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో భయాందోళన మొదలైంది. నెక్ట్స్ పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేస్తారా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు పాల్పడుతున్నారు.