మేడ్చల్ మండలంలో భారీగా ఆహార పదార్థాలు సీజ్

by Sridhar Babu |
మేడ్చల్ మండలంలో భారీగా ఆహార పదార్థాలు సీజ్
X

దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మండలం కిష్టాపూర్ గ్రామ పరిధిలోని హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిల్వ ఉంచిన మసాలాలు, వెల్లుల్లి పేస్టులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మసాలాలు, నిల్వ విభాగాలలో తగిన విధంగా పరిశుభ్రత పాటించడం లేదని తెలిపారు. లేబుల్ లోపాలు, మసాలా ఉత్పత్తిలో ఉపయోగిస్తున్న ముడి పదార్థాలపై తగిన లేబుల్ సమాచారం లేకపోవడం గమనించినట్లు పేర్కొన్నారు.

పెచ్చులు ఉడిపోయిన గోడలు, దుమ్ము ధూళితో మురికిగా పాడై ఉండటం, మెష్ విండోలు దెబ్బతిని దాని నుంచి చెక్కముక్కలు అక్కడే నిల్వచేసిన పలు రకాల పికిల్ బ్యారెల్స్ లో రాలిపడడం గమనించినట్టు చెప్పారు. బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఆహార పదార్థాల వంటకు పలుమార్లు వేడి చేసిన వంట నూనెను వాడుతున్నట్టు గమనించినట్టు తెలిపారు. దాంతో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని, అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మూడు లక్షల మూడు వేల రూపాయల విలువైన నిల్వ ఉంచిన మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ తనిఖీలలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పి. రోహిత్, ఎస్. శ్రీషిక, పి.స్వాతి, ఎన్. జగన్నాథ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed