బెల్లం ఘుమ ఘుమలు

by Naresh |
బెల్లం ఘుమ ఘుమలు
X

దిశ, భిక్కనూరు: చెరుకు ఫ్యాక్టరీకి కొట్టేందుకు సమయం ఉండటంతో చేసేదేమి లేక ఇద్దరు ముగ్గురు రైతులు బెల్లం వండుతున్నారు. చాలా రోజుల తర్వాత బెల్లం వాసన ఘుమఘుమ లాడుతోంది. బెల్లం పై నిషేధం విధించిన నేపథ్యంలో సుమారు 10 సంవత్సరాల తరువాత, కొంతమంది రైతులు బెల్లం వండటం మొదలుపెట్టారు. ఆరోగ్యం కోసం బెల్లం అవసరాలు ఏర్పడటం, వంటలో వాడకం పెరిగిపోవడంతో చాలామంది మార్కెట్లో దొరికే బెల్లం కొనుగోలు చేసేవారు. అయితే స్థానికంగా నాణ్యమైన బెల్లం దొరకడం కష్టం గా మారిన నేపథ్యంలో, స్థానిక రైతులు వండుతున్న బెల్లంను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రైతుతో పాటు, రామేశ్వర్ పల్లి గ్రామంలో మరో రైతుతో పాటు వివిధ గ్రామాల్లో ఒకరిద్దరు రైతులు బెల్లం వండుతున్నారు. ఇదివరకటిలాగా 18 నుంచి 20 కిలోల బకెట్లలో వండడం కాకుండా, అదే పాత బకెట్లలో ముద్దలు తయారుచేసి కిలో చొప్పున తూకం చేసి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి రూ. 100 రూపాయలకు కిలో చొప్పున రైతులు బెల్లం విక్రయిస్తున్నారు.

రూ. 50 రూపాయలకు లీటర్ చొప్పున స్వచ్ఛమైన చెరకు రసం దొరుకుతుందని కావలసినవారు పలానా ఫోన్ నెంబర్లను సంప్రదించాలని పలుచోట్ల రైతులు ఫ్లెక్సీలు కూడా కడుతున్నారు. అయితే సంక్రాంతి పండకు ముద్దలు కట్టేందుకు బెల్లం అవసరం ఉన్నవారు బెల్లం వండే స్థలానికి వెళ్లి అవసరమైన మేరకు బెల్లం కొనుగోలు చేసుకుని వస్తున్నారు.

అప్పటిలో సీఎం రేవంత్‌కు బెల్లం ముద్ద బహూకరణ…



శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భిక్కనూరు మండల కేంద్రానికి టీపీసీసీ చీఫ్ హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి కి రైతు రామా గౌడ్ చెరుకుగడలు, బెల్లం ముద్దను మోసుకొచ్చి బహుకరించారు. బెల్లం ముద్దను రేవంత్ రెడ్డి భుజం పై ఎత్తుకున్నాడు. బెల్లం పై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని వేడుకున్నారు.

ఎక్సైజ్ అధికారుల తనిఖీ…

బెల్లం వండుతున్నారన్న విషయం తెలిసి రైతు రామా గౌడ్ వ్యవసాయ బావి వద్దకు చేరుకొని కొద్ది రోజుల క్రితం పరిశీలించారు. నిషేధం ఉండగా బెల్లం వండవద్దని, తమకు తమ సమస్యలు ఎదురవుతాయని ఎక్సైజ్ అధికారులు రైతును హెచ్చరించినా ఖచ్చితంగా వండుతామని, మేము చిల్లర విక్రయం కోసం మాత్రమే వండుతున్నామని, కావాలంటే ఎవరెవరికి విక్రయించామో లిస్ట్ కూడా ఇస్తామని స్పష్టం చేశారు. గుడుంబా, నాటు సారా తయారీ ఏమైనా చేస్తున్నారా అని సదరు రైతును ప్రశ్నించగా, కేవలం నిత్యం వండుకునే వంటల్లో వాడుకునేందుకు మాత్రమే ఈ బెల్లం వండుతున్నామని, కావాలంటే విక్రయానికి సిద్ధం చేసిన కిలో బెల్లం ప్యాకెట్లను తయారు చేసి సిద్ధంగా ఉంచిన వాటిని చూపించారు.





Advertisement

Next Story