బేగారి విష్ణుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌

by GSrikanth |
బేగారి విష్ణుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి బేగారి విష్ణు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను పొందారు. పేద కుటుంబంలో పుట్టిన విష్ణు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో విద్యనభసించి ఓయూలో పీహెచ్ డీ పూర్తిచేసి డాక్టరేట్ ను అందుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన విష్ణును తల్లిదండ్రులు బేగరి నరసమ్మ, ఆనందం కష్టపడి చదివించారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ పాలనశాస్త్రంలో, ప్రొఫెసర్ అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో ‘సర్వ శిక్ష అభియాన్, ఇంపాక్ట్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్’ అనే అంశంపై తన పరిశోధన చేసి ఈ పట్టాను అందుకున్నారు.

విద్య అంటే తనకు ఇష్టం కాబట్టే తన పరిశోధన కూడా స్కూల్ ఎడ్యుకేషన్‌పై చేసి సమాజంలో గవర్నమెంట్ పాఠశాలలు వాటి స్థితిగతులు, విద్యార్థుల పరిస్థితి, వారు పడుతున్న ఇబ్బందులపై పరిశోధన చేసినట్లు విష్ణు చెప్పారు. విష్ణుకు డాక్టరేట్ రావడంపై ఆయన స్నేహితులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా విష్ణు చిన్నప్పటి నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ, యూనివర్సిటీ స్థాయిలో ఒక సంఘానికి యూనివర్సిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక కేసులు నమోదైనా ఎదుర్కొని పీహెచ్ డీ పట్టా అందుకోవడం గమనార్హం.

Advertisement

Next Story