- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఈడీ వర్సెస్ డీఈడీ.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎవరికి..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఈడీ వర్సెస్ డీఈడీ అభ్యర్థులు అన్నట్టుగా పరిస్థితి మారింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వందకు వంద శాతం ఖాళీలు తమతోనే నియామకాలు చేపట్టాలని పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీన ‘చలో ఇందిరాపార్క్’ పేరిట మహాధర్నాకు తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం లీడర్లు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 5 లక్షల మంది ఉన్నారని, అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్‌లో 70 % ఎస్జీటీల కోటాను తొలగించి 100 % పోస్టులు బీఈడీ అభ్యర్థులతోనే చేపట్టాలనే డిమాండ్‌తో ధర్నాకు పూనుకుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రతి బీఈడీ అభ్యర్థి ధర్నాలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసమే తాము కష్టపడి బీఈడీ చేసినప్పుడు తమకు కాకుండా ఎస్జీటీలుగా నియామకమైన వారికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల తమ జీవితాలు నాశనమవుతున్నాయని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోషన్స్ కోటా తగ్గించాలని డిమాండ్
బీఈడీ వారికి డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేదని, కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లాల్లో కేటగిరీ వారీగా తీస్తే రెండు, మూడు పోస్టుల కంటే ఎక్కువగా ఉండటం లేదని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం డీఈడీ పోస్టులను ఎస్జీటీలకు కేటాయించినపుడు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ వారితోనే భర్తీ చేయాలని కోరుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 % పదోన్నతులను ఎస్జీటీల ద్వారా భర్తీ చేస్తే.. ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ వారికి అవకాశం కల్పించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పదోన్నతుల కోటాను సవరించాలని, దానిని 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఏ పోస్టులు పెంచండి
గతంలో ఎన్‌సీటీఈ గెజిట్‌ను బట్టి అందరు అభ్యర్థులు బీఈడీ చేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత లేనట్లేనని వారు పేర్కొన్నారు. ఈ లెక్కన కొత్త బీఈడీ కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిదని వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలకు అరకొర పోస్టులే ప్రకటిస్తున్నారని, వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్‌లో అయినా ఎస్ఏ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల నిష్పత్తి 70:30 ఉంది. ఇందులో 70 %పదోన్నతుల ద్వారా భర్తీ అయితే.. మిగతా 30 % మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అని అభ్యర్థులు వాపోతున్నారు. బీఈడీ అభ్యర్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఈడీ అభ్యర్థులు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.