గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు.. స్పందించిన భట్టి

by Sathputhe Rajesh |
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు.. స్పందించిన భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో :అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబరులో సమావేశాలు ముగిసినా ఇప్పటివరకు ప్రోరోగ్ చేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమేనని అన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వ పాలనా అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండేవని, సభ్యులుగా తాము చర్చించడానికి వీలు చిక్కేదని, ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. సీఎల్పీ సమావేశం సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క పై వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదంటే ప్రతిపక్షాలు గొంతు విప్పకుండా చేయడమేనని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కేదన్నారు. ఐదు నెలలుగా సభను ప్రోరోగ్ చేయకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించాలనే భావన కలుగుతున్నదన్నారు.

Advertisement

Next Story