'ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో న్యాయం జరగడం లేదు'

by GSrikanth |
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో న్యాయం జరగడం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో మాదిరిగానే తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను వేరుగా ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ సీతారాంనాయక్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో న్యాయం జరగడం లేదన్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో ఆదివాసీ, గిరిజన మేధావుల సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ జీవో ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నిజమైన భూమి పుత్రుడని అన్నారు. తెలంగాణలో అధికంగా బంజారా, గిరిజనులు ఉన్నారన్నారు. సేవాలాల్ తిరిగిన నేల అని అందుకే అక్కడ బంజారా భవన్ నిర్మించామన్నారు. తెలంగాణలో 3146 తండాలను పంచాయతీలుగా కేసీఆర్ చేశారు. నిజాంకు ఎదురొడ్డి పోరాడిన ఖాను నాయక్‌ను వీర యోధుడిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. కోట్ల మంది మాట్లాడే బంజారాలకు లిపి కల్పించాలని, సంత్ సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రోడ్స్ అండ్ బిల్డింగ్ చీఫ్ ఇంజనీర్ మోహన్, జేటీసీ పాండురంగనాయక్, ఆదివాసి ఐటీడీఏ అధికారి ప్రభాకర్, అడిషనల్ సెక్రెటరీ సైదా కుమార్, మాజీ ఐపీఎస్ డిటీ నాయక్, నాయకులు ప్రభాకర్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్, సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed