ఓం భూం.. బుష్.. బీఆర్ఎస్‌ను మించిన కాంగ్రెస్.. తెలంగాణ బడ్జెట్‌పై బండి సంజయ్‌

by Ramesh N |
ఓం భూం.. బుష్.. బీఆర్ఎస్‌ను మించిన కాంగ్రెస్.. తెలంగాణ బడ్జెట్‌పై బండి సంజయ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన (Telangana budget) బడ్జెట్‌ను పరిశీలిస్తే.. డొల్ల అని తేలిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) విమర్శించారు. బడ్జెట్ తీరును విశ్లేషిస్తే.. అబద్దాలు.. అంకెల గారడీ.. 6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని, ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని, అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్‌ను సాధనంగా చేసుకోవడం సిగ్గు చేటన్నారు. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైందన్నారు. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్‌లో గొప్పలు చెప్పిన సర్కార్.. అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మహిళలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గత బడ్జెట్ లోనూ, ఈ బడ్జెట్‌లోనూ నయాపైసా కేటాయించలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భ్రుతిపై బడ్జెట్‌లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు అని తెలిపారు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదని, వృద్ధుల పెన్షన్ పెంపును ప్రస్తావించకుండా వారిని గాలికొదిలేసిందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదన్నారు. గత(2024-25) ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 91 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయినా దాఖలాల్లేవని తెలిపారు. అబద్దాల్లో, అంకెల్లో.. కోతలు కోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ను మించిపోయిందని విమర్శించారు. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా.. ఆచరణలో మాత్రం నయా పైసా ఖర్చు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోందేని, గత బడ్జెటట్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు.. అని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపులను చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకంటే మైనారిటీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైనట్లుగా తేట తెల్లమైందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణమని, రైతుకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి అయ్యాయని విమర్శించారు.

బడ్జెట్ తీరు తెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కన్పిస్తోందని, ఆదాయ, వ్యయాలను చూస్తుంటే అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా కాంగ్రెస్ పాలన మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 6 గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులను చేసేలా సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులకు, వాస్తవిక ఖర్చు వివరాలతో పాటు కాంగ్రెస్ సర్కార్ గతేడాది బడ్జెట్ కేటాయింపులు, వాస్తవిక ఖర్చు వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed