Solar eclipse: ఈనెల 29న సూర్య గ్రహణం.. ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే?

by D.Reddy |
Solar  eclipse: ఈనెల 29న సూర్య గ్రహణం.. ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికి తెలుసు. అలాగే, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ క్రమంలో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించడు. దీనినే సూర్య గ్రహణం (Solar eclipse) అంటారు. ఇది అమావాస్య రోజుల్లో జరుగుతుంది. కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు. ఇక ఈ నెల 29వ తేదీ (మార్చి 29) ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే, ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కాదు, పాక్షిక గ్రహణం. అంటే.. చంద్రుడు సూర్యుని కాంతిని పాక్షికంగా అడ్డుకుని సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే కనిపించేలా చేస్తాడు. దీంతో సూర్యుడు నెలవంక ఆకారంలో కన్పిస్తాడు. ఈ సందర్భంగా ఈ ఖగోళ అద్భుతం ఏ ఏ ప్రాంతాల్లో కనువిందు చేయనుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ సూర్య గ్రహణం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక్షం కానుంది. ఇక భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ఏర్పడి సాయంత్రం 6:13 వరకు ఉంటుంది. అయితే, ఇది భారత్‌లో కనిపించదు. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని కొన్ని ప్రాంతాలలో నివసించే వారికి ప్రత్యేకంగా ది బెస్ట్ వ్యూ కనిపించనుంది. అలాగే, ఆఫ్రికా, సైబీరియా, కరేబియన్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణాన్ని చూడగలరు. ఇక ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవడం అవసరం.

అయితే, దీని ప్రభావం భారత్‌పై లేనందున సూతక్ కాలం కూడా వర్తించదు. శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం మొదలవుతుంది. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇది ముగుస్తుంది. గ్రహణం కన్పించే ప్రదేశాలలో మాత్రమే సూతక్ కాలం వర్తిస్తుంది. ఇక ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు (రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు) ఏర్పడున్నాయి. ఈ ఏడాది మొదటి గ్రహణం మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.

Next Story