కేంద్ర మంత్రి హోదాలో సొంత గడ్డపై బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్

by Prasad Jukanti |
కేంద్ర మంత్రి హోదాలో  సొంత గడ్డపై బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అందరూ ఎమ్మెల్యేలను, నాయకులు, కార్యకర్తలను కలుపుకుని అభివృద్ధి కోసం కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి బుధవారం కరీంనగర్ కు వచ్చారు. సొంత గడ్డను చూసి పులకరించిపోయిన ఆయన నేలతల్లిని ముద్దాడారు. అనంతరం కరీంనగర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. తనకు వచ్చిన ఈ పదవి బాధ్యతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన బిక్ష అన్నారు. కార్యకర్తల కష్టం, పార్టీ పెద్దల మద్దతుతో తాను నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అయ్యానన్నారు. రాజకీయంగా ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు, కరీంనగర్ కు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగానంటే ఇది కేవలం బీజేపీ లోనే సాధ్యం అవుతుందని, బీఆర్ఎస్ మూర్ఖత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు తిన్న పోలీసుల లాఠీ దెబ్బలు, గృహనిర్భంధాలు, జైలు జీవితాల వల్లే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో దాదాపు 150 రోజుల పాటు కార్యకర్తలు వారి కుటుంబాలకు దూరంగా, సొంత పనులను వదులుకుని నా అడుగులో అడుగులేసి శ్రమించారన్నారు. ఈ పదవి కార్యకర్తలకే అంకితమిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పదవులు అనుభవించడానికో, డబ్బులు సంపాధించుకోవడానికో కాదని దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణకు, కరీంనగర్ కు నిధులు తీసుకువచ్చేందుకు వినియోగించుకుంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పారు.

రేపటి సెల్యూట్ తెలంగాణ విజయవంతం చేయండి:

కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రేపు తొలిసారి తెలంగాణకు రాబోతున్నారని, ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి 'సెల్యూట్ తెలంగాణ' పేరుతో బీజేపీ రాష్ట్ర షాఖ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ కర్యక్రమాన్ని రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులంతా విజయవతం చేయాలని పిలుపునిచ్చారు.



Next Story