BRS అంటే బీర్, రమ్, స్కాచ్ పార్టీ: బండి సంజయ్ ఫైర్

by Satheesh |
BRS అంటే బీర్, రమ్, స్కాచ్ పార్టీ: బండి సంజయ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ఒక అసమర్ధ ముఖ్యమంత్రి అని విమర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లేకేజీతో పాటు పదో తరగతి పేపర్లు కూడా బైటకు వస్తున్నాయని, ఇవన్నీ పాలనపై ఆయన నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనమన్నారు. గతంలో ఇంటర్ బోర్డు విద్యార్థులు చనిపోయినప్పడు, తాజాగా పేపర్ల లీక్‌ల విషయంలో సీఎం ఇప్పటికీ స్పందించలేదని, రాజకీయ అంశాలపై ఉన్న శ్రద్ధ సొంత రాష్ట్ర ప్రజలపై ఎందుకు లేదని ప్రశ్నించారు.

సికింద్రాబాద్‌లో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ల లీక్ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, బాధ్యులెవరో తేల్చడానికి సిట్టింగ్ జడ్జి చేత విచారణ కోసం ఆదేశాలు ఇవ్వడానికి సీఎం ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఇంత నిర్వాకం జరిగినందుకు నైతిక బాధ్యతగా సీఎం, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

తొమ్మిదేళ్ళ పాలనలో ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ ఈ మధ్యకాలంలో ధరణితో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. తాజా పేపర్ల లీకులతో కేసీఆర్ ఒక అసమర్థ సీఎంగా, ఇది చేతకాని ప్రభుత్వంగా రుజవైందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కేటీఆర్ తోపు అని గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు ఆ టెక్నాలజీ సత్తా ఏంటో, కేటీఆర్ గొప్పలేంటో కళ్ళముందు కనిపిస్తున్నాయన్నారు.

ప్రధాని మోడీ విద్యార్హత గురించి బీఆర్ఎస్ నేతల డిమాండ్‌ను బండి సంజయ్ ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ డిగ్రీని తొలుత బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్హతకు, డిగ్రీలకు, ప్రధాని పదవికి సంబంధం లేదన్నారు. మోడీని ప్రపంచమే కొనియాడుతున్నదని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌ను విమర్శించినప్పుడల్లా ప్రధానివైపు వేలెత్తి చూపడం వీరికి ఫ్యాషన్‌గా మారిందన్నారు.

కవిత ఉన్నత విద్య సారా దందాకు, ఆ కుటుంబంలో ఇంకొకరి చదువు డ్రగ్స్ కు, మరొకరి చదువు కమిషన్లకు ఉపయోగపడిందని విమర్శించారు. ఇదేనా వారికి చదువు నేర్పింది అని ఎదురు ప్రశ్నించారు. చదువుకున్న అజ్ఞానులంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ దొంగల ముఠాగా తయారైందని, చివరకు ప్రజల్లో అది బీరు, రమ్, స్కాచ్ పార్టీగా గుర్తింపు పొందిందని ఎద్దేవా చేశారు.

పదవులు లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీ బతకలేకపోతున్నదని, అందుకే నైతిక బాధ్యత వహించకుండా వాటిని పట్టుకుని వేలాడుతూ ఉన్నారని, రాజీనామా చేయకుండా నిస్సిగ్గుగా కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. బాసర ట్రిఫుల్ ఐటీలో ఆందోళన జరిగినా, ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, పేపర్ల లీక్ జరిగినా, పదో తరగతి పరీక్షల్లో రిపీట్ అయినా సైలెంట్‌గా ఉండిపోయారని అన్నారు.

నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ ను నిర్వహించనున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మద్దతు పలుకుతారని అన్నారు. ఈ నెల 8న ప్రధాని రాష్ట్ర పర్యటన అధికారికంగా జరిగేదని, పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు.

అనంతరం పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలపై రాష్ట్ర నేతలతో చర్చిస్తారని, బూత్ సశక్తీకరణ్, కమిటీల ఏర్పాటు తదితరాలపై చర్చిస్తారని తెలిపారు. ఈ నెల 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Advertisement

Next Story