BRS మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్

by GSrikanth |
BRS మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు తనతో ఇప్పటికే పలుమార్లు మాట్లాడారని, ఆ విషయం తెలిసే కేసీఆర్ మూర్చపోయినట్లున్నారని బండి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సంజయ్ లీగల్ టీంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పోలీసులే తన ఫోన్‌ను మాయం చేశారని ఆరోపణలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తనకు చాలా మంది ఫోన్లు చేశారని, తన ఫోన్ బయటకు వస్తే ఇంకెన్ని సంచలన అంశాలు బయటకు వస్తాయోననే భయంతోనే కేసీఆర్ పోలీసులను పంపించి తన ఫోన్‌ను మాయం చేసి ఉంటారన్నారు. ఆ ఫోన్‌ను కేసీఆర్ తన వద్దే పెట్టుకున్నట్లున్నారని బండి వెల్లడించారు. ఇతరుల ఫోన్ల సంభాషణ వినడమే ఆయనకు ఉన్న పని అని సంజయ్ పేర్కొన్నారు. వాస్తవానికి కరీంనగర్‌లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సిద్దిపేట వెళ్లే వరకు తన చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తరువాత మాయమైందని, అంటే అది పోలీసుల పనేనని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని దాచి పెట్టి తనను ఫోన్ అడగడం సిగ్గుచేటని బండి ఫైరయ్యారు.

బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరని, దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలని బండి డిమాండ్ చేశారు. రాజీనామా విషయంలో కేసీఆర్ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా? అని సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని సంజయ్ తప్పుపట్టారు. ప్రధాని మోడీని అవమానిస్తారని, దిష్టిబొమ్మలను తగలబెడతారని, వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను తిడితే మాత్రం నాన్ బెయిలెబుల్ కేసు పెడతారని, సోషల్ మీడియా కార్యకర్తలనూ వదలరని, పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారని విరుచుకుపడ్డారు. అలా చేసి కేసీఆర్ మెప్పు పొంది ప్రమోషన్లు పొందేందుకు కొందరు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారని బండి మండిపడ్డారు.

బీజేపీ లీగల్ విభాగం నేతలతో సమావేశమైన బండి బీజేపీ చేస్తున్న పోరాటాలపై కేసీఆర్ ప్రభుత్వ నిర్బంధం, కార్యకర్తలపై అక్రమంగా పెడుతున్న కేసుల అంశంపై చర్చించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలపై మరింత నిర్బంధాలు పెరగడంతోపాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ తెలిపారు. ఈ తరుణంలో బీజేపీ లీగల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కోరారు. లీగల్ టీం ఉందనే ధైర్యం, కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని వారి సేవలను కొనియాడారు. అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, ఎక్కడ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించి ప్రజా సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తల పక్షాన నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

టీఎస్‌పీఎస్సీ లీకేజీపై సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు

టీఎస్‌పీఎస్సీ లీకేజీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా హైకోర్టు న్యాయమూర్తులకు లేఖలు రాయాలని బండి సంజయ్ బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం చిన్న పొరపాటు కూడా లేకుండా లక్షలాది ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, కేసీఆర్ ఫ్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోందనే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బండి వారికి సూచించారు. త్వరలోనే వివిధ కోచింగ్ సెంటర్లతోపాటు రాష్ట్రంలోని యూనివర్శిటీల్లోనూ పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాలన్నారు. కమిటీ కన్వీనర్ విఠల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తాము చేపట్టిన కార్యక్రమాలను బండికి వివరించారు. నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీతో తొలిసారి సమావేశమైన బండి సంజయ్ ‘నిరుద్యోగ మార్చ్’ తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story