సీఎం కేసీఆర్‌కు తొమ్మిదేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా: Bandi Sanjay

by Mahesh |   ( Updated:2023-06-03 07:54:13.0  )
సీఎం కేసీఆర్‌కు తొమ్మిదేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా: Bandi Sanjay
X

దిశ, డైనమిక్ బ్యూరో: తొమ్మిదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఒకటైతే చేసింది మరొకటి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరుతూ శనివారం సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని, మీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని దుయ్యబట్టారు. తెచ్చుకున్న తెలంగాణ సాధించుకున్న సంబురం కూడా లేకుండా సకల జనులను దగా చేసినందుకు రోజుకో పండుగ చొప్పున 21 రోజుల పాటు సంబురాలు చేసుకుందామనుకుంటున్న మీ ప్రభుత్వం ఇకనైనా మీ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించిన పంటలను సకాలంలో కొనకుండా కొర్రీలు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. వడ్ల కుప్పలపై రైతు చనిపోయే దుస్థితికి కారకులు ఎవరన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున సాయం ఏమైందని నిలదీశారు. రూ.లక్ష రుణమాఫీ, ఫ్రీ యూరియా, విత్తనాలు, 57 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఓట్లు దండుకుని మోసం చేసింది మీరు కాదా? అని నిలదీశారు. సారు...కారు...60 పర్సెంట్ సర్కార్ ఎవరిది?. దళిత బంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమిషన్ తీసుకున్న అవినీతి ప్రభుత్వం మీది కాదా? అని ప్రశ్నించారు.

మీది నిజంగా సుపరిపాలనే అయితే 50 వేలకు పైగా జీవోలను ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదన్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, జైళ్లకు పంపుతున్నారని, ఉచిత కరెంట్ పేరుతో డిస్కంలను సంక్షోభంలో నెట్టి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది నిజం కాదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో పారిశ్రామిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అన్నారు. కమీషన్ల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప మీరు సాధించిన ప్రగతి ఏముందన్నారు.

మీకు భజన చేసే కవులు, కళాకారులకే గుర్తింపు, పింఛన్లు ఇస్తున్నారని ఏ వర్గానికి న్యాయం జరిగిందని రోజుకో ఉత్సవం జరుపుకోవాలన్నారు. వాస్తవాలను ప్రజల ముందుంచుతూ తెలంగాణ కోసం పాటుపడుతున్న కవులు, కళాకారులను పక్కన పెట్టినందుకు ‘సాహిత్య దినోత్సవం’. మహిళలపై సొంత పార్టీ నేతలే అఘాయిత్యాలు చేస్తున్నందుకు ‘మహిళా దినోత్సవం’. సర్కార్ దవాఖానకు పోతే బాలింతలు చనిపోతున్నందుకు ‘వైద్యారోగ్య దినోత్సవం’. పల్లెలు, పట్టణాల ప్రగతిని గాలికొదిలేసినందుకు ‘పల్లె, పట్టణ ప్రగతి ఉత్సవాలు’ జరుపుకోమంటారా అని ప్రశ్నించారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10 లక్షలిస్తా మని చెప్పి మోసం చేసినందుకు, బిల్లులు రాక సర్పంచులు ప్రాణాలు తీసుకుంటున్నందుకు ఉత్సవాలు జరుపుకోవాలా అన్నారు. మీ కుటుంబ పాలనలో బాగుపడ్డదెవరు? దగాపడ్డదెవరు? 9 ఏళ్ల మీ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి, వివిధ రూపాల్లో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని లేఖలో పేర్కొన్నారు.

ఒడిశా రైలు ఘటనపై దిగ్భ్రాంతి..

ఒడిశాలో రైలు ప్రమాదంపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతులకు సంతాపం తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు రైలు ప్రమాద మృతుల సంతాప సూచకంగా తెలంగాణలో నేడు జరగాల్సిన ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా బండి ప్రకటించారు. ఈ మేరకు నేడు కేంద్ర మంత్రుల, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిపారు. రైలు ప్రమాద మృతులకు సంతాప సూచకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నివాళి అర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Also Read..

3 పథకాలు.. 6 ఆత్మహత్యలు.. 9 ఏళ్ల KCR పాలనలో విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువ!

Advertisement

Next Story