కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగాలి.. బీజేపీ కార్యకర్తలకు బండి కీలక పిలుపు

by Satheesh |
కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగాలి.. బీజేపీ కార్యకర్తలకు బండి కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం సభను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగాలని, అందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించే సత్తా ఖమ్మం బీజేపీ నాయకులకు ఉందా? ఖమ్మం బీజేపీ నాయకులకు సభ నిర్వహించడమే చేతకాదనే విమర్శలు వస్తున్నాయని, ఈ సవాల్‌ను కార్యకర్తల తరుపున తాను స్వీకరిస్తున్నట్లు సంజయ్ చెప్పారు. ఖమ్మం జిల్లా కాషాయ అడ్డా అని నిరూపించే టైం కార్యకర్తలకు వచ్చిందని, వారు తమ దమ్మేంటో ఈ సభలో చూపించాలని కోరారు.

ఈనెల 15వ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించే అమిత్ షా సభను సక్సెస్ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్ బూత్ సభ్యులతో, ఆపై నాయకులు, కార్యకర్తలతోనూ బండి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం సభకు 5 రోజుల సమయమే మిగిలుందని, ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదని హేళన చేస్తున్న వాళ్లకు గుణపాఠం చెప్పాలని, కనువిప్పు కలిగేలా బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని సంజయ్ కోరారు.

అభినవ సర్దార్ వల్లభాయి పటేల్ అమిత్ షా ఖమ్మం కార్యకర్తలకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బండి పిలుపునిచ్చారు. ఖమ్మం కార్యకర్తలంతా బరిగీసి కొట్లాడతారనే సంకేతాలు ఇచ్చేలా బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని, ఇంటింటికీ తిరిగి సభకు రావాలని ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో బహిరంగ సభను సక్సెస్ చేస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed