మరో జమ్మిక్కుకు కేసీఆర్ ప్లాన్.. విలీనమా.. విమోచనమా.. విద్రోహమా?

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-03 06:59:49.0  )
మరో జమ్మిక్కుకు కేసీఆర్ ప్లాన్..  విలీనమా.. విమోచనమా.. విద్రోహమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరుతో కేసీఆర్ మరో జిమ్మిక్కుకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా కేసీఆర్ తెలంగాణ అమర వీరులను ఘోరంగా అవమానించారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. సీఎం పీఠమెక్కినాక ఆ అవసరమే లేదంటూ మాట తప్పడం దుర్మార్గం అంటూ విరుచుకుపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ నిఖార్సైన తెలంగాణవాది అయితే.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 17న తెలంగాణ విలీనానికి బదులు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అనేక ఏళ్ళుగా రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సమీక్ష చేయడాన్ని బండి సంజయ్ స్వాగతించారు.

విలీనమా.. విమోచనమా.. విద్రోహమా?:

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేడెక్కిన నేపథ్యంలో తెరపైకి సెప్టెంబర్ 17 టార్గెట్ గా రాజకీయ దుమారం చెలరేగుతోంది. గతంలో ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఆ మాటే ఎత్తలేదు. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. బీజేపీ మాత్రం పార్టీ పరంగా ఈ ప్రత్యేకమైన రోజును ప్రతి ఏడాది విమోచన దినోత్సవం పేరుతో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతూ వస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్న వేళ ఈ సారి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అయింది.

ఇక బీజేపీ దూకుడును గమనించి కేసీఆర్ ఈ ఏడాది విలీన దినోత్సవం పేరుతో ఏడాది పాటు వజ్రోత్సవాలు నిర్వహించాలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచనపై బీజేపీ భగ్గుమంటోంది. అయితే సెప్టెంబర్ 17ను బీజేపీ విమోచనం అంటుంటే.. టీఆర్ఎస్ విలీనం అంటుంది. ఇక కమ్యూనిస్టులు జరిపిన సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమై సోషలిస్టు రాజ్యం ఏర్పడాలని కాంక్షించారని, ఇంతలోనే కేంద్ర సైన్యం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుందని, అందువల్ల ఈ రోజును విద్రోహ దినమని మరికొంత మంది వాదిస్తున్నారు. ఈ మూడింటిలో దేనికి సర్వజనామోదం లభించడం లేదు.

Also Read : బీజేపీ పాలిత రాష్ట్రాలపై నజర్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం?

Advertisement

Next Story