- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: తెలంగాణ బీజేపీ నెక్ట్స్ సారథి ఎవరు.. రేసులో ముగ్గురు కీలక నేతలు?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఎన్నికలకు కాషాయ పార్టీ బండి ఆధ్వర్యంలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు ఆయనకే ఇచ్చేందుకు హైకమాండ్ డెసిషన్ తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని కొనసాగింపుపై పార్టీ జాతీయ నాయకత్వం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. దీనిపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ సైతం స్పష్టతనిచ్చారు.
ఇక అధికారిక ప్రకటన వెలువడమే తరువాయి. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మార్చి 11నాటికి మూడేళ్లు పూర్తి అవుతాయి. వాస్తవానికి బీజేపీలో అధ్యక్షుడి కాలపరిమితి మూడేళ్లు. రెండు దఫాలుగా చాన్స్ ఇస్తారు. బండి సంజయ్ ది ఒక టర్మ్ పూర్తికానుంది. కాగా ఎన్నికలు కూడా ఉన్నందున కొత్త వారిని నియమిస్తే ఇబ్బందులు తలెత్త వచ్చని భావించిన అధిష్టానం ఆయననే కొనసాగించనుంది. ఇప్పటికే తరుణ్ చుగ్ వ్యాఖ్యలతో పార్టీ నేతల్లో జోష్ నెలకొంది. బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లడమే సరైన నిర్ణయమని పలువురు నేతలు అంటున్నారు. పార్టీని ఇంతస్థాయికి తీసుకొచ్చిన వ్యక్తికే కట్టబెడితే అధికారంలోకి రావడం ఇంకా సులువవుతుందని శ్రేణులు పేర్కొంటున్నాయి.
అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా..
వాస్తవానికి రాష్ట్రంలోక ఉనికి కూడా చాటుకోలేని స్థితిలో ఉన్న కమలం పార్టీని అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే స్థాయికి తీసుకురావడంలో బండి పాత్ర కీలకం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకోగా బీజేపీ పగ్గాలు బండి చేతిలో ఉంటేనే బాగుంటుందనే యోచనలో జాతీయ నాయకత్వం కూడా ఉంది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు కూడా సంజయ్‌కి పుష్కలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనతోనే వెళ్లాలని పార్టీ ఇప్పటికే డిసైడ్ అయ్యింది. 2024 స్థానిక సంస్థల ఎన్నికల వరకు బండి సంజయే అధ్యక్షుడిగా కొనసాగుతారని తరుణ్‌చుగ్ సైతం స్పష్టంచేశారు. త్వరలో దీనికి సంబంధించి జాతీయనాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని కమలనాథులు చెబుతున్నారు.
ఇతర పార్టీల నుంచి చేరికలు
బండి అధ్యక్షుడు అయ్యాక దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. మునుగోడులో ఓడిపోయినా భారీగా ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది. పట్టణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో బండి సక్సెస్ అయ్యారు. గతేడాది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో విజయసంకల్ప సభ సక్సెస్ కావడంతో ఏకంగా ప్రధాని మోడీ సైతం బండిపై ప్రశంసల జల్లు కురిపించారు. భుజం తట్టి శభాష్ అని కితాబిచ్చారు.
బీజేపీలో ఎన్నడూ లేని పాదయాత్రలను తెరపైకి తీసుకొచ్చి కొత్త అధ్యాయానికి బండి తెరదీశారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని ఎదిగేలా చేశారు. పార్టీ క్రమంగా బలోపేతం కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేతలు చేరికలు సైతం పెరిగాయి. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, విఠల్, రాణి రుద్రమదేవి, జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి పలువురు ఆయన సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకోవడం సైతం బండికి కలిసొచ్చింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ పార్టీ నుంచి హుజురాబాద్‌లో గెలిచారు. ఆయనకు తెలంగాణ ఉద్యమకారులు, ఇతర వర్గాల ప్రజల మద్దతు ఉండగా అధ్యక్ష పదవికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కేసీఆర్ వేసే ప్రతి స్కెచ్ తెలుసని, బాధ్యతలు అప్పగిస్తే అధికారంలోకి తీసుకొస్తానని ఆయన అధిష్టానం వద్ద పలుమార్లు వివరించినట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి రెండు రోజులు మకాం వేసిన ఈటల.. అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. కాగా అధ్యక్షుడిగా మార్చే అవకాశం లేకపోగా ఆయన స్థాయి తగ్గకుండా ఏదైనా పదవి ఇచ్చే చాన్స్ సమాచారం. ప్రచార కమిటీ బాధ్యతల అష్యూరెన్స్‌తో ఢిల్లీ నుంచి తిరిగివచ్చినట్లు టాక్.
ఆయనతో పాటు అధ్యక్ష పదవికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్ సైతం రేసులో ఉన్నారు. కానీ బండిని మార్చే ఉద్ధేశం అధిష్టానానికి లేకపోవడంతో చేసేదేమీ లేక ఎవరికి వారు పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్రలు చేసి పార్టీని గ్రామీణ ప్రాంతాలకు పరిచయం చేసిన బండి సంజయ్ తనదైన మార్క్‌తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం స్ట్రీట్ కార్నర్ మీటింగులు, ఆపై బూత్ స్వశక్తికరణ్ అభియాన్‌పై పార్టీ దృష్టి కేంద్రీకరించగా పాదయాత్రలు మార్చి రెండోవారం తర్వాతే ప్రారంభం కానున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి జాతీయ నాయకత్వం బండి సంజయ్‌పై విశ్వాసాన్ని కాపాడుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read...