Thummala: బీఆర్ఎస్ నేతలపై దాడి .. మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-09-03 14:49:08.0  )
Thummala: బీఆర్ఎస్ నేతలపై దాడి .. మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మంలో నగరంలో స్థానికులు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య జరిగిన తోపులాట ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తుమ్మల సహకారంతోనే ఈ ఘటన జరిగిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన .. నా చరిత్ర ఏంటో ఆ కారులో ఉన్న వారికీ తెలుసన్నారు. అక్కడ రాజకీయంగా మాట్లాడబోతే స్థానికులు అడ్డుకోవడంతో ఇదంతా జరిగిందని తనకు సమాచారం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్దతులు సరికాదని, ఈ తరహా ఘటనలను ఎవరూ హర్షించరన్నారు. సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో దీన్ని ఒక వివాదాంశంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మంచిది కాదన్నారు. ప్రతిపక్ష నాయకులు వారి పాత్ర వారు పోషించాలన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరు ఎవరికి సమాధానం చెప్పాలో ప్రజలు నిర్ణయించారని అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ప్రజల కోసమే పని చేశానన్నారు. గత 40 ఏళ్లుగా కృష్ణా, గోదావరి నదులకు అత్యంత హైయ్యెస్ట్ వరదలు చూసిన వారిలో తాను ఒక్కడిని అని, మున్నేరు వాగుకు వరద గతంలో ఎన్నడూ చూడనటువంటిదన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు సంయమనంతో పని చేసుకుపోవాలన్నారు. ప్రభుత్వం తరపున ప్రజలను నిలబెట్టే ప్రయత్నాలు ఉంటాయే తప్ప ఈ చిల్లర గొడవలు, చిల్లర వ్యవహారాలతో రాజకీయాలు నడిపించాలనుకుంటే ఇది ఎవరికీ మంచిది కాదన్నారు. ఘర్షణలను ఎవరు ప్రేరేపించినా అటువంటి చర్యలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. వర్షాలు, వరదల కారణంగానే రుణమాఫీ ఆలస్యం అవుతున్నదని త్వరలోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసి 100 శాతం రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed