దారుణం.. ఇద్దరు యువతులపై దాడి? గొంతు తెగి ఒకరి మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-16 07:27:53.0  )
దారుణం.. ఇద్దరు యువతులపై దాడి? గొంతు తెగి ఒకరి మృతి
X

మంచిర్యాల/మంచిర్యాల టౌన్: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గొంతులు తెగి ఉన్న ఇద్దరి యువతుల్లో అంజలి అనే యువతి మృతి చెందగా, మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన జిల్లాలోని రామకృష్ణాపూర్ సమీపంలోని మామిడి గట్టు అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధ రాత్రి జరిగింది. ఎవరైనా దాడి చేసి గొంతులు కోశారా? లేదా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మందమరి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన అంజలి, నెన్నెల మండలం మన్నెగూడకు చెందిన మహేశ్వరీలు సమీప బంధువులు. ఇద్దరూ మంచిర్యాలలోని విద్యానగర్‌లో ఒకే ఇంట్లో అద్దెకు ఉంటూ నివసిస్తున్నారు. వారిద్దరూ ప్రేమికులు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కాగా, వారిద్దరికీ ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య మనస్పర్ధలకు దారి తీసినట్టుగా తెలుస్తోంది.

అయితే మామిడి గట్టు అటవీ ప్రాంతంలో గొంతులు తెగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరినీ వారి స్నేహితులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అంజలి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మహేశ్వరి చికిత్స పొందుతోంది. అక్కడికి వీరు ఎందుకు వెళ్లారు, ఎవరైనా తీసుకెళ్లి దాడి చేశారా, మనస్పర్ధలతో వారే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా అంజలి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే వారిద్దరితో పరిచయం ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Next Story