- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల వేళ సర్కార్‌కు బిగ్ రిలీఫ్.. ఒక్క నెలలోనే ఊహించని తీరులో ఆదాయం..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకాలం సమస్యగా మారిన నిధుల సమీకరణకు మార్గాలు సుగమమవుతున్నాయి. రుణమాఫీ కోసం అవసరమైన దాదాపు 19 వేల కోట్ల రూపాయలు ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం సమకూర్చుకున్నది. భూముల అమ్మకం, ఔటర్ రింగ్ రోడ్డును లీజుకివ్వడం, మద్యం దుకాణాల అప్లికేషన్ ఫీజు తదితరాల రూపంలో సమకూరాయి.
రానున్న రోజుల్లో వేర్వేరు రూపాల్లో మరింత ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హామీలను అమలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం దానికి తగిన విధంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఆశించిన తీరులోనే నిధులు వచ్చి పడుతున్నాయి.
ఒక్క నెలలో ఊహించని తీరులో ఆదాయం
కేవలం నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.14,324 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కోకాపేట్‌లో హెచ్ఎండీఏ ఇటీవల వేలం ద్వారా భూములు అమ్మడంతో రూ.3,319 కోట్లు, బుద్వేల్‌లోని భూముల విక్రయంతో రూ.3,625 కోట్లు వచ్చాయి. ఔటర్ రింగు రోడ్డు లీజు ద్వారా మరో రూ.7,380 కోట్లు వచ్చాయి.
మొత్తంగా ప్రభుత్వం చేతికి ఒక్క నెల రోజుల్లోనే ఊహించని తీరులో ఆదాయం సమకూరింది. నాన్-టాక్స్ రూపంలో ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22,808 కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం ఐదు నెలల్లోనే దాదాపు రూ.15,822 కోట్లు పొందగలిగింది. జూన్ చివరి నాటికి కేవలం రూ.1,488 కోట్లు మాత్రమే వస్తే జూలై, ఆగస్టు (సెకండ్ వీక్ వరకు) నెలల్లో అదనంగా రూ.14,324 కోట్లను ఆర్జించింది.
ఇప్పటికే రూ.200 కోట్లు
దీనికి తోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చే టెండర్ ప్రక్రియను మూడు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటికే సుమారు రూ.200 కోట్లకు పైగా అప్లికేషన్ ఫీజుల రూపంలో సమకూరింది. ఈ నెల 18న దరఖాస్తుల గడువు ముగుస్తుండడంతో సుమారు రూ.2 వేల కోట్ల కంటే ఎక్కువే వస్తుందని ఎక్సయిజ్ శాఖ భావిస్తున్నది.
ప్రతి మద్యం దుకాణానికీ కనీసంగా 20 అప్లికేషన్లు రావాలని ఈసారి కొత్త నిబంధన పెట్టడంతో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ఒక్క వైన్ షాపునకే రూ.40 లక్షలు ఆదాయం వస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 2,620 దుకాణాలకు రూ.1,048 కోట్లు కనీస స్థాయిలో అందుతుంది.
మరిన్ని భూముల విక్రయం
హైదరాబాద్ సిటీ (రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిని కూడా కలుపుకొని) భారీ స్థాయిలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఒక్కో వైన్ షాపునకు వందల సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని ఎక్సయిజ్ శాఖ అంచనా వేస్తున్నది. దీంతో కేవలం అప్లికేషన్ ఫీజు రూపంలోనే రూ.2 వేల కోట్లు సమకూరుతుందని ఎక్సయిజ్ శాఖ అంచనా. దీని తర్వాత ఫస్ట్ క్వార్టర్ అడ్వాన్సు లైసెన్స్ ఫీజు రూపంలో అదనంగా సుమారు రూ.3,000 కోట్లు ఖజానాకు చేరనున్నది.
చేతివృత్తులకు చేయూత, మైనారిటీలకు లక్ష రూపాయల సాయం, గృహలక్ష్మి స్కీమ్ తదితరాలన్నింటినీ అవసరమైన నిధులను రానున్న రోజుల్లో భూముల విక్రయం ద్వారా సమకూర్చుకోడానికి మంత్రివర్గ ఉప సంఘం రోడ్ మ్యాప్ తయారుచేసింది. సెప్టెంబరు చివరి నాటికి రూ.30 వేల కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంటే అందులో ఆ అంచనా ప్రకారమే నెల రోజుల్లో సగం సమకూరింది. ఇకపైన కూడా ఇదే ప్లాన్ ప్రకారం మిగిలిన మొత్తాన్ని కూడా ఆర్జించి స్కీమ్‌ల అమలుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నది.