ఎవర్ని అడిగి వరద సాయం ప్రకటించారు.. విరాళ ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు..!

by Kavitha |   ( Updated:2024-09-04 15:32:41.0  )
ఎవర్ని అడిగి వరద సాయం ప్రకటించారు.. విరాళ ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు..!
X

దిశ, వెబ్‌డెస్క్: వరద బాధితులను ఆదుకునేందుకు ఒక రోజు మూలవేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలా ప్రకటించిన ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్‌ మీడియా వేదికగా ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

అసలు తమను సంప్రదించకుండా, అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని సోషల్‌మీడియాలో(Social Media) ఫైర్‌ అయ్యారు. డీఏ(DA) బకాయిలు విడుదల చేయించలేదు. సరెండర్‌లీవుల బిల్లులు ఇప్పించలేదు. పీఆర్సీ(PRC) గురించి అడగరు.. కానీ ఎవరు అడిగారని ఒకరోజు వేతనం ఇస్తామని ఒప్పుకున్నారని మండిపడ్డారు. రెండు నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వనేలేదని పేర్కొన్నారు. ఎవరి మెప్పు కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారంటూ తిరుగుబాటు చేశారు.

కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి నీలదీసినంత పనిచేశారు. సహాయమనేది వ్యక్తిగతమని. ఎంత ఇవ్వాలని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. 'విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అంతా నాయకులు ఇష్టమేనా.. ఎదుటి వాళ్ల జీతం మీద మీకు ఏం హక్కు ఉంది?' అంటూ ఓ ఉద్యోగి(Employee) సోషల్‌మీడియాలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed