వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.. తెలంగాణ అమరుల ఆశయాల సాధన జేఏసీ డిమాండ్

by Javid Pasha |
వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.. తెలంగాణ అమరుల ఆశయాల సాధన జేఏసీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ అమరుల ఆశయాల సాధన జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్ లో జేఏసీ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో 1969 నుంచి 2014 వరకు పాల్గొన్న ఉద్యమకారుల కుటుంబాలను అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం తక్షణమే 10వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆదుకోవాలని కోరారు. 30 రోజుల్లో గన్ పార్కు అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభోత్సవం చేయాలని డిమాండ్ చేశారు. తొలి దశ 369, మలిదశ ఉద్యమంలో 1200 విద్యార్థి యువతీ, యువకులు అమరులయ్యారని, వారి పేర్లను అమరులజ్యోతి కట్టడ ప్రాంగణంలో జిల్లాల వారీగా అమరుల పేర్లతో కూడిన జాబితాను సందర్శకులకు కనబడేలా శిలాఫలకాలపై రాసిపెట్టాలని డిమాండ్ చేశారు. మలిదశ ఉద్యమంలో అమరులైన ఇంకా 700 కుటుంబాలకు సాయం అందలేదని, తక్షణమే చర్యలు తీసుకొని ఆర్థిక, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

1969 ఉద్యమంలో369మంది విద్యార్థి, యువతను కాల్చి చంపిన నాటి సీఎం కాసు బ్రాహ్మానందరెడ్డి విగ్రహాన్ని తొలగిస్తామని ఇచ్చిన హామీ మేరకు తొలగించి తెలంగాణ అమరవీరుల స్మారక ఉద్యాన వనంగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో అమరులైన వీలైనన్ని అమరుల విగ్రహాలను అందులో ఏర్పాటు చేయాలని కోరారు. కాసు విగ్రహం తెలంగాణ ప్రజలను వెక్కిరిస్తున్నట్లుగా, అవహేళన చేసినట్లుగా ప్రజలు భావిస్తున్నారని, అవమానంగా కుమిలిపోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ అస్తిస్తవ సంరక్షణ కర్మశాల అధ్యక్షుడు డి.అశోక్ కుమార్, తెలంగాణ తొలి-మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు బత్తుల సోమయ్య, తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదికమరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి, తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు బింగి రాములు, సామాజిక తెలంగాణ పోరాట సమితి అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed