KCR ముందస్తు ప్లాన్.. వ్యూహత్మకంగా బీజేపీ అడుగులు

by Nagaya |   ( Updated:2023-01-24 02:27:49.0  )
KCR ముందస్తు ప్లాన్.. వ్యూహత్మకంగా బీజేపీ అడుగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అటువైపుగానే అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముందస్తే నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ నోటిఫికేషన్లు రిలీజ్ చేశారని, లేదంటే ఇప్పుడెందుకు ఇస్తాడని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతేకాకుండా జిల్లా పర్యటనలు, కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, పలు చోట్ల బహిరంగ సభలు, కంటి వెలుగు 2.0 పథకం, ఇతరత్రా ఏర్పాట్లన్నీ అందుకోసమేనని ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చ జరగుతోంది. అంతేకాకుండా ఫిబ్రవరిలో సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత ముందస్తు ప్రకటన వచ్చే అవకాశముందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంతో బీజేపీతో అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి నిజంగానే ముందస్తు నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రణాళికలు రచించాలనే అంశంపై కసరత్తులను ముమ్మరం చేసింది. కాగా ఈ అంశాలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గా సమావేశాల్లోనూ చర్చించే అవకాశముంది.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని ఇప్పటికే కాషాయ పార్టీ నేతుల స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. ముందస్తుకు సైతం సిద్ధమని పలువురు రాష్ట్ర పెద్దలు బహిరంగంగానే స్పష్టం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సైతం 9 నెలలకు మించి సమయం లేదు. కాగా ముందస్తు ప్రచారంతో పొలిటికల్ హీట్ రెట్టింపయింది. అందుకే బీజేపీ అధికారంలోకి రావాలంటే ఈ స్పీడ్ సరిపోదని నేతలంటూనే గ్రౌండ్ రియాలిటీపై దృష్టిసారిస్తున్నారు. సంస్థాగతంగా బలోపేతమైతే తమను ఢీకొట్టే వారే లేరనే భరోసాను కనబరుస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రతో బలోపేతమైన తమకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే 9 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం నిర్వహించనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రివ్యూ నిర్వహించనున్నారు. ఎక్కడ వీక్‌గా ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నామనే అంశాలపైనా సమీక్ష నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పాలమూరులో నిర్వహించనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలతో పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. గతంలో పట్టణానికే పరిమితమైన కాషాయ పార్టీ ఇప్పుడు గ్రామీణ స్థాయి వరకు వెళ్లింది. దీనికి దుబ్బాక, హుజురాబాద్ బైపోల్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా 12 వేల ఓటు బ్యాంకు నుంచి 86 వేలకు పెరగడం గమనార్హం. దీన్నిబట్టి పాదయాత్ర ఎంతమేరకు ఉపయోగపడిందనేది అర్థం చేసుకోవచ్చు. కాగా బండి సంజయ్ ఇప్పటి వరకు ఐదు విడుతల యాత్రలు పూర్తిచేశారు. ఆరో విడుతను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా వరుస కార్యక్రమాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరిలోనూ షెడ్యూల్ బిజీగా ఉండటంతో సిక్స్త్ ఫేజ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని మోడీ రాకను బట్టి నెక్ట్స్ ఫేజ్ ఏర్పాట్లను చేపట్టనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలపై పాదయాత్ర విజయాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశముంది. బస్సుయాత్రలపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని బీజేపీ నేతలు అంత కాన్ఫిడెంట్ గా ఉండటంపై అధికార పార్టీకి సమస్యగా మారింది. అంత ధీమాగా ఉన్నారంటే ఎలాంటి వ్యూహాలు వేస్తారోననే ఆందోళన మొదలైంది. ముందస్తుకు వెళ్తే మంచిదా? కాదా? అనే డైలమాలో పడింది. ఇదే టైంను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. సంస్థాగతంగా బలోపేతమవ్వడంతో పాటు నేతలను లాక్కోవడంపై దృష్టిసారించనుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకోవడం దాదాపు కన్ఫామ్ అయిపోయింది. ఇప్పటికే పలువురు జాతీయ పెద్దలతో చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా పలు అనివార్య కారణాల వల్ల చేరిక ఆలస్యం కానుంది. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా ఆయన చేరవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే నిజమైతే వీక్‌గా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం 5 నియోజకవర్గాలు కాషాయ పార్టీ ఖాతాలో పడుతాయని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీని ఇరుకున పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న కమలనేతల వ్యూహాలు సక్సెస్ అవుతాయా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

Also Read...

సొంతజాగ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈసారి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపు

Advertisement

Next Story