Harish Rao : అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి వివాదం.. రంగంలోకి దిగిన హరీష్ రావు!

by Ramesh N |   ( Updated:2024-09-12 12:07:06.0  )
Harish Rao : అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి వివాదం.. రంగంలోకి దిగిన హరీష్ రావు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కలిసి బైఠాయించారు. ఈ క్రమంలోనే అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ ఇంటిపై దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గాంధీతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి హారీష్ రావు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని హరీష్ రావు సీరియస్ అయ్యారు.

మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య.. అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది అని, రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.

పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం అవుతుందన్నారు. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందన్నారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని, వెంటనే సిద్దిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed