బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో మళ్లీ TRS పార్టీ.. ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం

by Satheesh |
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో మళ్లీ TRS పార్టీ.. ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ ఉనికిలోకి రాబోతున్నది. తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వెళ్ళింది. సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

పార్టీ కార్యాలయంగా ఓల్డ్ అల్వాల్ (ఇం. నెం. 1-4-177/148, 149/201) చిరునామాతో అప్లై చేశారు. పార్టీ ఉపాధ్యక్షులుగా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా వెల్గటూర్ గ్రామానికి చెందిన నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా పొన్నాల గ్రామానికి చెందిన సదుపల్లి రాజు వ్యవహరిస్తున్నట్లు దరఖాస్తులో అధ్యక్షుడు తుపాకుల బాలరంగం పేర్కొన్నారు.

ఈ పేరుతో పార్టీని వీరే స్వచ్ఛందంగా పెడుతున్నారా లేక వీరితో ఎవరైనా రాజకీయ నాయకుడు పెట్టిస్తున్నారా అనేది స్పష్టం కావాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌)గా మార్చిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతో మరో రాజకీయ పార్టీ ఏదీ లేదు.

ఎలాగూ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కొత్తగా ఎవ్వరూ పార్టీని పెట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళడం గమనార్హం. టీఆర్ఎస్ పేరు తెలంగాణలో ప్రజల్లో చిరపరిచితం కావడంతో కొత్త పార్టీ అబ్రివేషన్ టీఆర్ఎస్ వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం.

కొత్త పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలంటూ 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్రకటనను తెలంగాణ రాజ్య సమితి నిర్వాహకులు ఫోర్త్ వాయిస్ అనే పత్రికలో ఆంగ్లంలో మార్చి 29న ప్రకటన (అడ్వర్టయిజ్‌మెంట్) ఇచ్చినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నది.

ఇదే ప్రకటనను హిందీ భాషలో సులభ్ అనే పత్రికలో మార్చి 28న ఇచ్చినట్లు పేర్కొన్నది. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ ఈ నెల 26న విడుదల చేసిన నోటీసు ప్రకారం మే నెల 27 వరకు అవకాశం కల్పించింది. అప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు కమిషన్‌కు వెళ్తాయన్నది ఆసక్తికరం.

వాస్తవానికి ‘తెలంగాణ రాజ్య సమితి పార్టీ’ పేరుతో గతంలోనే రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది. కానీ ప్రతీ సంవత్సరం సమర్పించాల్సిన వార్షిక ఆడిట్ రిపోర్టును, ఆదాయపు పన్ను శాఖకు రిటన్‌లను సమర్పించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీచేసింది. నిర్దిష్ట గడువు ప్రకారం వాటిని సమర్పించకపోయినట్లయితే ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కూడా రాతపూర్వకంగా ఆ పార్టీకి సమాచారం ఇచ్చింది.

కానీ వరుస నోటీసులకు ఆ పార్టీ నుంచి స్పందన రాకపోవడం, పోస్టు ద్వారా పంపిన లేఖలు ‘డోర్ లాక్’ పేరుతో తిరిగి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు రావడంతో దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ సెక్రటరీ అశోక్ కుమార్ 2016 జూలై 14న ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కార్యాలయం సికింద్రాబాద్ లాలాగూడలోని తుకారాం గేట్ (డోర్ నెం. 10-5-342/34) చిరునామాతో ఉండేది.

టీఆర్ఎస్ అబ్రివేషన్ వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రైతు సమితి పేర్లతో ఖమ్మం జిల్లా నుంచి సీనియర్ పొలిటికల్ లీడర్ ప్రయత్నిస్తున్నట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. తెలంగాణ రైతు సమితి పేరుతో ఇప్పటికింకా దరఖాస్తు విషయమై కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వివరణ ఇవ్వకపోయినా తెలంగాణ రాజ్య సమితి పేరుతో మాత్రం కొత్త పార్టీ ఏర్పాటు కోసం దరఖాస్తు వచ్చినట్లు వెల్లడించింది. వచ్చే నెల 27 నాటికి కమిషన్‌కు అందే అభ్యంతరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌పై నిర్ణయం జరగనున్నది.

తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పార్టీని రిజిస్ట్రేషనన్ చేయవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో సిద్దిపేట చిరునామాతో అప్లికేషన్ వెళ్ళడం గమనార్హం. నిజంగా పార్టీని పెట్టాలని పొంగులేటి భావించినట్లయితే సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం నుంచి ఈ పార్టీని టేక్ ఓవర్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed