కేంద్రం బీసీల ఆకాంక్షలను నెరవేర్చాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

by GSrikanth |
కేంద్రం బీసీల ఆకాంక్షలను నెరవేర్చాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల సమగ్ర సామాజిక అభివృద్ధికి మండల కమిషన్ చేసిన సిఫారసులను కేంద్రం అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల ఆకాంక్షలను పీఎం మోడీ గౌరవించి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాను గురువారం బీసీ ప్రతినిధి బృందంతో కలిసి భేటీ అయ్యారు. అదే విధంగా కేంద్రమంత్రి రామ్ దాస్ అథావలెను కలిసి 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని లేకుంటే దేశంలో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం మాట్లాడుతూ.. దేశంలో సగభాగం ఉన్న బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని, ప్రత్యేకంగా బీసీల జనగణన, మండల్ సిఫారసులు అమలు కోసం సీపీఎం పార్టీ జాతీయ కమిటీ తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

కేంద్రంపై బీసీలు చేసే ఉద్యమానికి సీపీఎం వెన్నుదన్నుగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ.. కేంద్రం బీసీల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బిహార్ మాదిరిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనగణన చేపట్టాలని, బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్ దాస్ అత్త వాలే మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపట్టాలని, బీసీలకు అండగా ఉంటానని అన్నారు.

బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన కేంద్రం పరిశీలిస్తుందని, క్రిమిలేయర్ ఆదాయ పరిమితులు 8 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం ద్వారా బీసీలకు రావాల్సిన హక్కులకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రం, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, నేతలు ఈడిగి శ్రీనివాస్ గౌడ్, సింగం నాగేష్, బూడిద మల్లికార్జున్, నరేష్ ప్రజాపతి, పానుగంటి విజయ్, వరికుప్పల మధు, ఇంద్రం రజక, సాయి తేజ, నాగరాజుగౌడ్, గూడూరు భాస్కర్, బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story