బ్రేకింగ్ : వేధింపులకు మరో ఇంటర్ విద్యార్థి బలి!

by Sathputhe Rajesh |
బ్రేకింగ్ : వేధింపులకు మరో ఇంటర్ విద్యార్థి బలి!
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి స్వాతిక్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరో ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మణికొండలో శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో పదిరోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు.

రిషి కాలేజీలో శివకుమార్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కుల పేరుతో ఒత్తిడి పెంచడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోస్టుమార్టం పూర్తైన అనంతరం డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అందించనున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. శివకుమార్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం వేధింపులు మితిమీరిపోతున్నాయని మండిపడుతున్నారు. కాగా, కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత 20 రోజుల్లో రాష్ట్రంలో ఐదుగురు విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్‌లో ర్యాంకుల కోసం ప్రైవేట్ కాలేజీలు విద్యార్ధులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Next Story