‘ధరణి’ విషయంలో సర్కార్ మరో కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
‘ధరణి’ విషయంలో సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ధరణి పోర్టల్‌(Dharani Portal)ను విదేశీ కంపెనీ నుంచి స్వదేశీ సంస్థ ఎన్ఐసీకి అప్పగిస్తూ కీల‌క నిర్ణయం తీసుకుంద‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. డిసెంబ‌ర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో భూ రికార్డుల నిర్వహ‌ణ బాధ్యత‌ను జాతీయ స‌మాచార సంస్థ నిర్వహిస్తుంద‌న్నారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. త్వర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్యల నుంచి ప్రజ‌ల‌కు పూర్తి విముక్తి క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆనాటి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలోని పెద్దలు ఎలాంటి ముందు చూపు లేకుండా హ‌డావిడిగా తొంద‌ర‌పాటు నిర్ణయాల‌తో తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్టల్ వ‌ల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంద‌న్నారు. తెలంగాణ‌కు చెందిన 1.56 కోట్ల ఎక‌రాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీకి తాక‌ట్టు పెట్టార‌ని, ఒడిశా రాష్ట్రంలో ఈ సంస్థ ప‌ని చేసి విఫ‌ల‌మైందన్నారు. ఇలాంటి సంస్థకు కేవ‌లం త‌మ స్వార్ధ ప్రయోజ‌నాల కోసం బీఆర్ఎస్ పెద్దలు క‌ట్టబెట్టిన‌ట్లు మంత్రి పొంగులేటి మండిపడ్డారు.

లక్షలాది మంది రైతులకు చెందిన భూములను, ప్రభుత్వ భూములను గత ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హయాంలోనే ఏకపక్షంగా విదేశీ కంపెనీలకు అప్పగించారు. దాంతో ఐదేళ్లపాటు ధరణి పోర్టల్ రైతులను నానా ఇబ్బందులు పెట్టిందన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ విదేశీ కంపెనీల చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి ఇస్తున్నామన్నారు. 71 లక్షల ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లయింది. ప్రజ‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఎన్నిక‌ల ప్రణాళిక‌లో ధ‌ర‌ణి పోర్టల్ ప్రక్షాళ‌న చేప‌డ‌తామ‌న్నారు. ఇచ్చిన మాట మేర‌కు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న తెలంగాణ భూముల‌ను కాపాడుకోవ‌డానికి , ఆ కంపెనీ కాంట్రాక్టు ర‌ద్దు చేసినట్లు చెప్పారు.

ధ‌ర‌ణి నిర్వహ‌ణ బాధ్యత‌ను మార్చడం వ‌ల్ల రాష్ట్రంలోని ల‌క్షలాది కుటంబాల స‌మ‌స్యలు, ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్నారు. అంద‌రి భూ స‌మ‌స్యల‌కు చ‌క్కని ప‌రిష్కారాలు త్వర‌లో ల‌భిస్తాయ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు. 2020 అక్టోబ‌ర్ లో తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్టల్ దారిత‌ప్పి లోప‌భూయిష్టంగా మారిందన్నారు. ధ‌ర‌ణి పేరుతో జ‌రిగిన ద‌గా వ‌ల్ల తెలంగాణా స‌మాజం తీవ్రంగా న‌ష్టపోయింద‌ని మంత్రి ఆవేద‌న వ్యక్తం చేశారు. గ‌త ప‌ది సంవ‌త్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజ‌ల ఆశ‌లు, ఆకాంక్షల‌ను స‌మాధి చేసింద‌ని ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వ పెద్దల దాష్టీకానికి ప్రజ‌లు అనుభ‌వించిన బాధ‌లు అన్నీ ఇన్నీ కావ‌ని, కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి చ‌ర‌మ‌గీతం పాడుతుంద‌ని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed