భద్రాద్రి రామాలయం అభివృద్ధికి బ్రేక్.. మళ్లీ అదే సమస్య పునరావృతం!

by Gantepaka Srikanth |
భద్రాద్రి రామాలయం అభివృద్ధికి బ్రేక్.. మళ్లీ అదే సమస్య పునరావృతం!
X

రామాలయం అభివృద్ధికి మళ్లీ బ్రేక్ పడనుందా..? అనే సందిగ్ధం నెలకొన్నది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సమయంలో మాడ వీధుల అభివృద్ధి కోసం అప్పుడు మొత్తం 26గృహాలు తొలగిస్తామని అధికారులు తెలపగా, గజానికి రూ.12వేలు చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదంటూ అప్పట్లో ఎనిమిది మంది ఇంటి యజమానులు కోర్టు నుంచి స్టే తీసుకుని రాగా ఆ ఇండ్లు మినహా మిగిలిన ఇండ్ల నుంచి స్థలం సేకరించారు. కాగా 12 ఏండ్ల తర్వాత రామాలయం అభివృద్ధి కోసం మళ్లీ స్థల సేకరణ మొదలు పెట్టారు. ఈసారి 43 ఇండ్లు తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

కాగా, గతంలో కోర్టుకు వెళ్లిన వారికి 12ఏండ్ల క్రితం ప్యాకేజీ ఇస్తామని, మిగిలిన ఇండ్లకు ప్రస్తుత ప్యాకేజీ ఇస్తామని అధికారులు తెలపడంతో వారు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎనిమిది వారాల్లో సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ను ఆదేశించగా ఆ ఎనిమిది మంది ఇంటి యజమానులతో చర్చలకు జరిపినా అసంపూర్తిగా ముగిశాయి. గురువారం భద్రాచలం ఆర్డీఓ ఇంటి యజమానులతో నిర్వహించిన చర్చల్లో వారు పాల్గొనలేదు. కాగా పరిహారం అందరికీ సమంగా చెల్లిస్తేనే ఇండ్లు ఇస్తామని లేకపోతే ఇవ్వమని వారు తెగేసి చెబుతున్నారు.

దిశ, భద్రాచలం: రామాలయం అభివృద్ధికి మళ్లీ బ్రేక్ పడనుందా..? గతంలో మాడవీధులు అభివృద్ధి అసంపూర్తిగా జరిగింది. పరిహారం విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆరు ఇండ్లను నేటి వరకూ తొలగించలేదు. ఇప్పుడు మళ్లీ అదే సమస్య పునరావృతం అయింది. ప్రస్తుతం రామాలయం అభివృద్ధికి 43 ఇండ్లను తొలిగించాల్సిన అవసరం ఏర్పడింది. కాగా గతంలో కోర్టుకు వెళ్లిన వారికి 12ఏండ్ల క్రితం ప్యాకేజి ఇస్తామని, మిగిలిన ఇండ్లకు ప్రస్తుత ప్యాకేజి ఇస్తామని అధికారులు తెలపడంతో వారు మళ్లీ హైకోర్టును ఆశ్రయుంచారు. ఎనిమిది వారాల్లో సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో కలెక్టర్ ఎనిమిది మంది ఇంటి యజమానులను చర్చలకు పిలిచారు. ప్యాకేజీ విషయంలో వ్యత్యాసం ఉండటంతో ఈ చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. మళ్ళీ గురువారం భద్రాచలం ఆర్డీఓ అందరు ఇంటి యజమానులను చర్చలకు పిలిచారు. ఈ సమావేశానికి కోర్టును ఆశ్రయించిన 8మంది ఇంటి యజమానులు వెళ్లలేదు.

మాడ వీధుల అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.9.75కోట్లు కేటాయించారు. అప్పుడు మొత్తం 26గృహాలు తొలిగిస్తామని అధికారులు తెలపగా, గజానికి రు. 12వేలు చెల్లించారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదంటూ ఎనిమిది మంది ఇంటి యజమానులు కోర్టు నుంచి స్టే తీసుకుని రావడంతో ఆ ఆరు ఇండ్లు మినహా మిగిలిన ఇండ్ల నుంచి స్థలం సేకరించారు. కాగా 12ఏండ్ల తర్వాత రామాలయం అభివృద్ధి కోసం మళ్లీ స్థల సేకరణ మొదలు పెట్టారు. ఈసారి 43ఇండ్లు తొలిగించాడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. అయితే ప్రస్తుతం తొలిగించే 43ఇండ్లలో గతంలో పరిహారం చాలదంటూ స్టే తెచ్చిన వారి ఇండ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం స్థల సేకరణలో అందరికీ ఆర్ ఆర్ ప్యాకేజీకి మూడు రెట్లు అదనంగా అంటే గజానికి సుమారు రు. 31వేలు చెల్లిస్తామని పేర్కొన్న అధికారులు, గతంలో స్టే తెచ్చిన ఇంటి యజమానులకు మాత్రం 12ఏండ్ల క్రితం ప్రకటించినట్లు గజానికి రు. 12వేలు మాత్రమే ఇస్తామని అధికారులు పేర్కొనడంతో మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. ఆ ఎనిమిది మంది ఇంటి యజమానులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకుని వచ్చారు. పరిహారం అందరికి సమంగా చెల్లిస్తేనే ఇండ్లు ఇస్తామని లేకపోతే ఇవ్వమని తెగేసి చెప్తున్నారు.

ఇదిలా ఉండగా ఇంటి యజమానులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు శనివారం సర్వే ప్రారంభించారు. శనివారం జరిగిన సర్వేలో స్టే తెచ్చిన ఇండ్లను సర్వే చేయలేదు. దీంతో మిగిలిన ఇంటి యజమానులు స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నా... ఆ ఆరు ఇండ్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ రామాలయం అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేదు. కాగా పరిహారం తేలకుండా, నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తున్నారని కొందరు ఇంటి యజమానులు అధికారులను ప్రశ్నించారు.

పరిహారం అందరికి సమానంగా ఇవ్వాలి: చెక్కాసాయి సుభాశ్ చంద్రబోస్

రామాలయం అభివృద్ధికి స్థల సేకరణకు తాము వ్యతిరేకం కాదు. కాని పరిహారం అందరికీ సమానంగా కాకుండా, మా ఎనిమిది మంది కోర్టుకు వెళ్లామని మాకు గజానికి రూ.12వేలు మాత్రమే ఇస్తామని, మిగిలిన ఇండ్లకు గజానికి రూ.31వేలు ఇస్తామని అధికారులు అంటున్నారు. అందరికి సమానంగా పరిహారం ఇస్తే మా ఇండ్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం అధికారుల చేతిలోనే ఉంది.

Advertisement

Next Story