కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అమిత్ షా తెలుగులో ఎమోషనల్ ట్వీట్

by Prasad Jukanti |   ( Updated:2024-03-13 10:57:46.0  )
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అమిత్ షా తెలుగులో ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం జరిపేందుకు మంగళవారం కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా దీనిపై బుధవారం అమిత్ షా తెలుగులో ఎమోషనల్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించడం ఇది చారిత్రాత్మకమైన రోజు అని కొనియాడారు. యువతలో దేశభక్తి జ్వాల రగిలించి, స్వాతంత్య్ర ఉద్యమంలో మన చిహ్నాలను చిరస్థాయిగా నిలిపేలా మోడీ తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో భాగమై ఉండేందుకు అత్యున్నత త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, అమరవీరులకు ఈ నిర్ణయం సముచిత నివాళి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఆసక్తి రేపుతున్న అమిత్ షా తెలుగు ట్వీట్లు:

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలైన మోడీ, అమిత్ షా వరుసగా రాష్ట్రాన్ని చుట్టిముట్టేస్తూ బీజేపీ శ్రేణుల్లో నూత ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న తెలంగాణలో పర్యటించిన అమిత్ షా.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వారియర్స్ తో భేటీ అయ్యారు. ఈ టూర్ సందర్భంగా ఆయన తెలుగులోనే ట్వీట్ చేశారు. 'చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలతో మమేకమయ్యేందుకు తెలంగాణ రాష్ట్రానికి బయలుదేరుతున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. తాజాగా సెప్టెంబర్ 17పై కేంద్రం నిర్ణయం తీసుకోగా దానిపై కూడా తెలుగులోనే రియాక్ట్ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సోషల్ మీడియా సేవలను విస్తృతంగా వినియోగించాలని భావిస్తున్న బీజేపీ అగ్రనేతలు అందులో భాగంగానే వ్యూహాత్మకంగా తెలుగులో ట్వీట్స్ చేస్తూ తెలుగు ప్రజలకు చేరువ అయ్యేలా ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో ప్రధాని మోడీ సైతం తెలుగులో ట్వీట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

Advertisement

Next Story