అంబానీయా.. మజాకా.. రైట్ హ్యాండ్‌కు రూ. 1500 కోట్ల బిల్డింగ్ గిఫ్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-26 06:29:27.0  )
అంబానీయా.. మజాకా.. రైట్ హ్యాండ్‌కు రూ. 1500 కోట్ల బిల్డింగ్ గిఫ్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖే అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎదుగుదలోను తమ ఉద్యోగులకు, సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పిస్తారనే పేరుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చాలా ఏళ్లుగా తనకు కుడి భుజంలా పని చేస్తున్న ఓ ఉద్యోగికి అంబానీ అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చారు. మనోజ్ మోడీకి రూ.1,500 కోట్ల విలువైన భారీ భవంతిని బహుమతిగా ఇచ్చి అంబానీ వార్తల్లో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ పలు -బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకోవడంలో మనోజ్ మోడీ కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలో మనోజ్ మోడీకి అత్యంత ఖరీదైన, విలువైన ప్రాంతంలో 22 అంతస్తుల ‘బృందావన్’అనే భవనాన్ని ముఖేష్ బహుమతిగా ఇచ్చారు. ఇది దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన నేపియన్ సీ రోడ్ మలబార్ హిల్‌కు ఆనుకుని ఉంది. చుట్టూ పచ్చని పరిసరాలు, అత్యున్నత స్థాయి సౌకర్యాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం మూడు వైపులా సముద్రం ఉండటం మరో ప్రత్యేకత. ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఒక్కో అంతస్తు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఏడు అంతస్తులను పార్కింగ్ కు కేటాయించారు. ఈ ప్రాంతంలోని ఫ్లాట్స్ చదరపు అడుగు రూ.45,100 నుంచి రూ.70,600 పలుకుతున్నాయి. ఈ లెక్కన బృందావన్ ఖరీదు రూ. 1,500 కోట్లు పైనే ఉంటుంది. కాగా, మనోజ్ మోడీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హజీరా పెట్రోకెమికల్ కాంప్లెక్స్, జామ్‌నగర్ రిఫైనరీ, రిలయన్స్ రిటైల్, 4జీ రోల్‌అవుట్ వంటి రిలయన్స్ భారీ ప్రాజెక్ట్‌లు కూడా మనోజ్ మోడీ పేరిట ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story