బడ్జెట్‌లో ఆర్ఆర్ఆర్‌కు రూ.1522 కోట్లు కేటాయింపు.. ఇక భూసేకరణ స్పీడ్‌అప్

by Sathputhe Rajesh |
బడ్జెట్‌లో ఆర్ఆర్ఆర్‌కు రూ.1522 కోట్లు కేటాయింపు.. ఇక భూసేకరణ స్పీడ్‌అప్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : నిధుల కేటాయింపుతో రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానున్నది. దాదాపు 339 కిలోమీటర్ల పరిధిలో నిర్మించతలపెట్టిన ఈ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.1522 కోట్లు కేటాయించింది. ఈ నిధుల కేటాయింపుతో పనుల ముందుకు సాగనున్నాయి. ఇప్పటికే భూ సేకరణ కోసం 90శాతం నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. అయితే తమకు భూమికి భూమే ఇవ్వాలని రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోనున్న నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కోట్లలో ధరలు పలికే భూములకు తక్కువ ధర చెల్లిస్తే అన్యాయం అవుతుందంటున్నారు. ఆ విషయంలో ప్రభుత్వం ఏ విదంగా నిర్ణయం తీసుకోనున్నదో చూడాల్సి ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దాదాపుగా 98.86 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానున్నది. ఇందుకోసం 3027 ఎకరాలు సేకరించాల్సి ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

చౌటుప్పల్ నుంచి జిల్లాలను చూట్టేస్తూ...

ఈ రీజినల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ నుంచి తిరిగి అక్కడి వరకు దాదాపు 339 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనున్నది. చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్ పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, షాద్ నగర్, అమనగల్ నుంచి చౌటుప్పల్ వరకు జిల్లాలను జాతీయ రహదారులను కలుపుతూ నిర్మాణం కానున్నది. ఆ రోడ్డును రెండు బాగాలుగా విభజించారు. చౌటుప్పల్ నుంచి గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు ఉత్తర భాగం 158 కిలోమీటర్లు, చౌటుప్పల్ నుంచి షాద్ నగర్ మీదుగా దక్షిణ భాగం 181 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనున్నది. బెంగుళూరు, నాగ్ పూర్, ముంబాయి, విజయవాడ, వరంగల్, శ్రీశైలం జాతీయ రహదారులను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.

90 శాతం నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 90శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ మూడు జిల్లాల మీదుగా 98.86 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగనున్నది. ఇందు కోసం నోటిఫికేషన్లు ఇచ్చామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించనున్నట్లు చెబుతున్నారు. అయితే తమకు అన్యాయం కాకుండా చూడాలసి ఇటీవల మెదక్ కలెక్టర్ కు నిర్వహితులు మొరపెట్టుకోగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాయపోల్, హత్నూర, గజ్వేల్ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాసితుల అందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రయోజనం

త్రిపుల్ ఆర్ నిర్మాణంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్కువ ప్రయోజనం పొందనున్నది. దాదాపు 100 కిలోమీటర్లు ఉమ్మడి జిల్లాలోనే ఉండడం గమనార్హం. వ్యాపార, వాణిజ్య వ్యవస్థలు మరింత బలోపేతం కావడం, రవాణా సులభతరం కానున్నది. భువనగిరి నుంచి సంగారెడ్డి రావడం రవాణా వాహనాలు ఎంతో ఈజీ కానున్నది. ఇప్పటికే ఓఆర్ఆర్ వచ్చిన తరువాత రవాణా వ్యవస్థ ఎంతో మెరుగు పడిన విషయం తెలిసిందే. ఇక త్రిపుల్ ఆర్ నిర్మాణం పూర్తయితే రాకపోకలు, అన్ని రంగాల వ్యవస్థలకు ప్రయోజనం చేకూరునన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనున్నది. ఈ క్రమంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది.

జిల్లా భూసేకరణ(ఎకరాలు) కిలోమీటర్లు

సంగారెడ్డి 850 25.2

సిద్దిపేట 975 31.76

మెదక్ 1202 41.9

మొత్తం 3027 98.86


Advertisement

Next Story