బిగ్ న్యూస్: ఉత్కంఠ రేపుతోన్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక.. గెలుపే లక్ష్యంగా బీజేపీ, BRS వ్యూహాలు!

by Satheesh |
బిగ్ న్యూస్: ఉత్కంఠ రేపుతోన్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక.. గెలుపే లక్ష్యంగా బీజేపీ, BRS వ్యూహాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడి గెలుపోటములే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని చర్చ మొదలైంది. దీంతో బోర్డు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీఆర్‌‌ఎస్, బీజేపీలు ఛాలెంజ్‌గా తీసుకుని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవగా.. ఏప్రిల్ 30న పోలింగ్, మే1న ఓట్ల లెక్కింపు జరగనుంది.

బోర్డులో మొత్తం 8 వార్డులు ఉండగా.. మెజార్టీ స్థానాలు దక్కించుకునే పార్టీకే బోర్డు వైస్ చైర్మన్ పదవి దక్కనుంది. దీంతో ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ బోర్డులో విజయం సాధిస్తే ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో పడనుంది. జులై తర్వాత ఎప్పుడైనా సాధారణ ఎన్నికలకు షెడ్యూలు రావొచ్చనే ప్రచారం నడుస్తున్నది. ఇక బోర్డు ఎన్నికల్లో గెలిచిన పార్టీ అదే జోష్‌తో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుచుకునే అవకాశం ఉంది.

కట్టడి చేసేందుకు ప్లాన్..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కసారి మాత్రమే బోర్డు వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ గెలుచుకుంది. అది కూడా ఇతర పార్టీల్లో గెలిచిన మెంబర్లను చేర్చుకోవడం ద్వారానే సాధ్యమైంది. ఈ సారి మాత్రం సొంతంగా బోర్డును కైవసం చేసుకునేందుకు ప్లాన్‌తో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నది. బోర్డులోని ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రతివార్డుకు ఓ ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా నియమించాలని భావిస్తున్నది. వారు ప్రతి ఓటరు వద్దకు వెళ్లి బీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. కంటోన్మెంట్‌కు ఏం చేస్తామో వివరించే ప్రయత్నం చేయనున్నారు. బోర్డును గ్రేటర్‌లో విలీనం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం చేస్తామని ఎన్నికల ఎజెండాతోనూ ప్రచారానికి రెడీ అవుతున్నది.

ఉనికే లేకుండా చేసేలా వ్యూహం

కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్‌కు పెద్దగా పట్టులేదని బీజేపీ భావిస్తున్నది. ఇతర పార్టీల్లో గెలిచిన మెంబర్లను చేర్చుకుందే కానీ.. ఇంతవరకు అక్కడ సొంత కేడర్ లేదని అంచనా వేస్తున్నది. ఈసారి బీఆర్ఎస్‌కు సింగిల్ వార్డు రాకుండా చేయాలనే వ్యూహం పన్నుతున్నది. ఓటర్లకు వద్దకు వెళ్లేలా ప్రత్యేక ప్రోగ్రామ్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నది. కంటోన్మెంట్‌లో ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారంతా కేసీఆర్‌పై వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. మెజార్టీ వార్డుల్లో బీజేపీ గెలుపు కోసం 60 రోజుల ప్లాన్ రూపొందించుకున్నట్టు తెలుస్తున్నది.

కాంగ్రెస్ సత్తాపైనా చర్చ

కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తున్నది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే గట్టి పోటీ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక కాంగ్రెస్ సత్తా ఏంటీ అనే చర్చ కూడా నడుస్తున్నది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ సొంత పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటీ? అనే ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story