Eatala Rajender: ఇక మనదే ఆ పాత్ర.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈటల కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-08-03 11:55:50.0  )
Eatala Rajender: ఇక మనదే ఆ పాత్ర.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పారు. వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ వరకు, కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ వరకు అన్ని ఎన్నికల్లో సీరియస్ గా పోరాటం చేస్తామన్నారు. శనివారం బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉన్నత స్థాయి కార్యకర్తల సమావేశంతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పలు కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని ధ్వజమెత్తారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం డొల్ల తననం మొన్నటి బడ్జెట్ తో బయటపడిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయామని తెలంగాణ ప్రజలు అంతర్మధనం చెందుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ కంటే దిగజారిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. విశ్వసనీయతకు, ఇచ్చిన మాటకు కట్టుబడే బీజేపీకి రాబోయే రోజుల్లో పట్టం కడతామనే భావనకు ప్రజలు వచ్చారన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మనమే పెద్దన్న పాత్ర పోషించాలి:

జీహెచ్ఎంసీ పరిధిలో 5 పార్లమెంట్ స్థానాలు ఉంటే వాటిలో 4 స్థానాలు మనమే గెలుచుకున్నామని తెలంగాణ జనాభాలో 1/4 వంతు జనాభా ప్రాంతంలో కాషాయ జెండా ఎగురవేశామని ఈటల చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 శాతం ఓట్లు సాధించామని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు సచ్చా చాటాలన్నారు. హామీల అమలు కోసం ప్రజల తరపున మనమే పెద్దన్న పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టో అమలు కోసం ప్రభుత్వంపై యుద్ధభేరి మోగిస్తామన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతు భరోసా కింద రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, చదువుకునే యువతులకు స్కూటీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల వృధాప్య పించన్లు, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు వాటిని ప్రస్తావించడం లేదని విమర్శించారు. రైతు రుణమాఫీ సైతం పూర్తిగా జరగడం లేదని తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు.

కేంద్రం, రాష్ట్రం మధ్య విభజన దేనికి?:

ప్రజాప్రతినిధులు అంటే ప్రజలు కట్టిన పన్నులకు కాపలాదారులు మాత్రమే అని ఈటల అన్నారు. అన్నీ ప్రజలు కట్టే పన్నులే అయినప్పుడు కేంద్రం వాటా, రాష్ట్రం వాటా అని విడదీయడం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసే పనులు వందశాతం కేంద్రం నిధులతోనే చేయాలని కోరానని, మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వే పనులు అన్నీ కేంద్రనిధులతో చేస్తామని హామీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇచ్చారని చెప్పారు. దుండిగల్ మున్సిపాలిటీలో లహరి గ్రీన్ పార్క్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో పాల్గొని ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు ఎలాంటి భేషజాలు లేవని, ఎమ్మెల్యే వివేక్ తనకు తమ్ముడు లాంటివాడని చెప్పారు. రాజకీయ నాయకుణ్ణి అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానని. అందరూ సంపాదన కోసమే రాజకీయాలు చేయరన్నారు. కొందరు సెన్సిటివిటీ ఉన్న పొలిటికల్ లీడర్ కూడా ఉంటారని చెప్పారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏమవుతుందో వయనాడ్ లో చూస్తున్నామన్నా ఈటల.. సమతుల్యతతో కూడిన వాతావరణం హైదరాబాద్ కు ఓ గొప్ప వరం అని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హైదరాబాద్ అంటేనే సిటీ ఆఫ్ లేక్స్.. కానీ ప్రస్తుతం చెరువులు, కుంటలు మురికి గుంటలుగా మారాయి. దుర్గంధ పూరితంగా మారాయన్నారు. ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ప్రైవేటు భూములు, అందులో కడుతున్న అపార్ట్మెంట్ లకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story