మళ్లీ ‘సోయం’ లొల్లి.. ముదురుతున్న వివాదం

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-01 03:15:18.0  )
మళ్లీ ‘సోయం’ లొల్లి.. ముదురుతున్న వివాదం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు సామాజిక వర్గాల నడుమ మళ్లీ వివాదానికి దారితీస్తున్నది. తుడుం దెబ్బ పోరాట ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సోయం బాపూరావు టీఆర్ఎస్ పార్టీ నుంచి బోథ్ శాసనసభ్యుడిగా గెలిచారు. అప్పటి నుంచి ఆయన అనేక వివాదాల్లో నిలిచారు. ఆ తరువాత కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరగా ఎంపీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి అనూహ్య విజయం సాధించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన సొంత సామాజిక వర్గం గోండు వర్గీయుల ఓట్లతో ఆయన విజయం సాధ్యమైందని బలంగా విశ్వసిస్తారు. అదే క్రమంలో ఆయన సామాజిక వర్గం కోసం కొట్లాడుతూనే ఉంటారు.

ఇటీవలి కాలంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతల ఆధిపత్యంతో జిల్లాలో కొనసాగుతున్న తుడుం దెబ్బలో కొన్ని వివాదాలు జరుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే బాబురావు మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో తన సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు బాపూరావుపై ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ కేంద్రమంత్రి అర్జున్ మేఘవాల్‌ను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారని ప్రచారం ఉంది. అయితే ఇది ఒక ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.

ఓ వైపు లంబాడాలపై తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేస్తూనే బీజేపీ ప్రతినిధిగా కేంద్రంలో అధికారంలో ఉన్న సొంత ప్రభుత్వానికే ఆయన లేఖ రాయడం తెలంగాణలో వివాదానికి దారి తీసింది. తాజా వివాదం నేపథ్యంలో లంబాడాలు పార్టీకి దూరమవుతారన్న ప్రచారం మొదలు కావడంతో కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ జి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమ సొంత పార్టీ ఎంపీ అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ ఆయన పేర్కొనడం వివాదాస్పదం అవుతున్నాయి. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు గోండ్ సామాజిక వర్గంపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడుతున్నారు. అయితే సొంత పార్టీకే చెందిన ఇద్దరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా ఇరు వర్గాల్లో కొంతమేర బ్యాలెన్స్ చేయవచ్చన్న ఉద్ధేశంతోనే కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

గోండు, లంబాడాల మధ్య మళ్లీ పోరు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండు లంబాడ సామాజిక వర్గాల నడుమ తీవ్రస్థాయి విభేదాలు ఉన్నాయి. గడిచిన నాలుగేళ్ల క్రితం లంబాడా ఉపాధ్యాయులను తమ గ్రామాలకు రానివ్వకుండా గోండు సామాజిక వర్గం అడ్డుకున్నది. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటినుంచి గోండులతోపాటు ఆదిమ గిరిజన సంఘాలు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కొమరం భీమ్ స్వస్థలం జోడెన్ ఘాట్‌లో లంబాడాల దైవం విగ్రహం ధ్వంసం నుంచి ఆసిఫాబాద్ కలెక్టర్ బదిలీ దాకా తీవ్ర వివాదమైంది. ఈ ఏడాది మళ్లీ వివాదం ముదిరి ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముట్టడి వాహనాల ధ్వంసం వంటి సంఘటనలు జరిగాయి.

ఈ పరిస్థితుల్లో ఎంపీ బాపూరావు చేసిన వ్యాఖ్యలు మళ్లీ రెండు సామాజిక వర్గాల నడుమ తీవ్ర వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలనాటికి ఆదిమ గిరిజన సంఘాలు, లంబాడ సంఘాలు రెండుగా చీలిపోయే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభావం ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లంబాడా జాతులు ఆదిమ గిరిజన జాతులపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story