'అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మోక్షం ఎప్పుడు..'

by Sumithra |
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మోక్షం ఎప్పుడు..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గేర్రే కాలనీలో 840 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూములు, లావని పట్టా భూములలో కొంతమంది అక్రమార్కులు షెడ్లు, ఇండ్లు నిర్మించుకొని ప్రభుత్వ అధికారులకు ఛాలెంజ్ గా మారారు. అయినప్పటికీ అక్రమార్కుల పై చర్యలు లేకపోగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో చెన్నూర్ మేజర్ గ్రామపంచాయతీని పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని, వేగవంతంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసినారు. ఈ సమయంలోనే కొంతమంది రియల్టర్లు ప్రభుత్వ, లావని పట్టా భూముల పై కన్నేసి గేర్రె కాలనీలో అక్రమ వెంచర్లు చేసి లక్షల గడించారు. ఇటీవల అమృత్ పథకంలో భాగంగా పట్టణంలో నిర్మించ తలపెట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములలో షెడ్లు, ఇండ్ల నిర్మాణం కలెక్టర్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ సర్వే నెంబర్లలో గల భూములలో సర్వే నిర్వహించి ఇండ్లు, షెడ్లు నిర్మాణాల పై తనకు పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు 34 మంది యజమాని దారులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారంతా సంజాయిషీ పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో హాజరైనారు. కాగా సదరు ఇంటి యజమానులు ఇచ్చిన సంజాయిషితో సంతృప్తి చెందని అధికారులు ఆన్లైన్లో వారి ఇంటి నెంబర్లను తొలగించారు. ఈ అక్రమ నిర్మాణాలకు కొంతమంది రాజకీయ నాయకులతో పాటు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది యజమానుల దగ్గర డబ్బులు గుంజి అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించిన విషయం బట్టబయలైంది. అయినప్పటికీ అక్రమ నిర్మానదారులపైన, అధికారుల పైన ఇప్పటివరకు ఎటువంటి చర్య లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన కొంతమంది రియల్టర్లు ఈ సర్వే నెంబర్ లో మిగిలి ఉన్న ప్లాట్లను కొనుగోలు చేసే దిశగా పావులు కలుపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ చెన్నూరు పట్టణంలో మాత్రం ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ రాజ భోగాల అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story