ఉట్నూరులో ఉద్రిక్తం..ఐటీడీఏ కార్యాలయం పై దాడి..

by Sumithra |   ( Updated:2023-02-20 13:36:41.0  )
ఉట్నూరులో ఉద్రిక్తం..ఐటీడీఏ కార్యాలయం పై దాడి..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఆదివాసుల ఆందోళన తీవ్రతరం అయింది. గతంలోనే వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్ తో సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న ఆదివాసులకు తాజాగా అసెంబ్లీలో 11 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ చేసిన తీర్మానం పుండు మీద కారం చల్లిన రీతిగా మారింది. దీంతో ఆదివాసుల్లో నిరసన సెగ మొదలైంది. గత వారం రోజుల నుంచి ఐటీడీఏ ముట్టడికి ఆదివాసి సంఘాలు అన్ని ఐక్యవేదికగా ఏర్పడ్డాయి. తుడుందెబ్బ నేతృత్వంలో పలు ఆదివాసి సంఘాలు యువజన విద్యార్థి సంఘాలు ఐక్యంగా దీనిపై పోరాటానికి సన్నద్ధం అయిన విషయం తెలిసిందే.

11 తెగలను ఎస్టీల్లో చేర్చడంపై నిరసన...దాడి

ఎస్టీ జాబితాలో కాయితి లంబాడా వాల్మీకి బోయ సహా 11 ఉపకులాలను చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని ఆదివాసులు నిరసిస్తున్నారు. అడవుల్లోనే పుట్టి పెరిగిన తమనుకాదని ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని ఆదివాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై తీవ్రనిరసన వ్యక్తం చేస్తూ ఆదివాసి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇందులో భాగంగానే సోమవారం ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. తుడుం దెబ్బసహా పలు ఆదివాసి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వేలాదిగా ఆదివాసులు ఐటీడీఏ కేంద్రం ఉట్నూరుకు తరలివచ్చారు. ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లి ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 11 ఉపకులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే యువకులు ఆదివాసి విద్యార్థులు తీవ్రఆందోళనతో పాటు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తమ ఆందోళనను అధికారులు పట్టించుకోకపోవడం పై నిరసన వ్యక్తం చేస్తూ కొందరు కార్యాలయం పైకి రాళ్లురువ్వారు. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కట్టలు తెగిన ఆగ్రహంతో ఐటీడీఏ కార్యాలయంలోకి చొరబడ్డారు. కార్యాలయం ఎదుట ఉన్న ఐటీడీఏ ఆదిమ గిరిజన తెగల సంక్షేమ సంఘం చైర్మన్ కనక లక్కేరావు వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకుని ఐటీడీఏ చుట్టూ మోహరించారు. ఆదివాసులను అదుపు చేసేప్రయత్నం చేయగా వారంతా తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక దశలో పరిస్థితి అద్భుతప్పుతోందని భావించడం పోలీసులు భారీగా బలగాలను తెప్పించారు. అయినప్పటికీ ఆదివాసులు తమ ఆందోళన విరమించలేదు ఐటీడీఏ కార్యాలయం ఎదుటనే బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు అధికారి తమవద్దకు వచ్చి వినతి పత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి పంపాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని రద్దు చేసేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.

ఎస్టీ లంబాడాలను తొలగించాల్సిందే...

ఉట్నూరుతో పాటు తెలంగాణలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదిమగిరిజనులను మాత్రమే ప్రభుత్వం ఎస్టీలుగా గుర్తించాలని వలస లంబాడాలను జాబితా నుంచి తొలగించాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేశాయి. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య మాట్లాడుతూ దశాబ్దాలుగా ఆదివాసులు మోసపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆదివాసులకు చెందిన భూములతో పాటు ఉద్యోగాలు వలసలు అంబాలాలు కొట్టేసారని ఆదివాసులు తీరని అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు తమ ఆవేదనను పట్టించుకోకపోగా కొత్తగా 11 ఉపకులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానం చేయడానికి ఆయన తప్పు పట్టారు. వెంటనే ఆ తీర్మానాన్ని రద్దు చేయాలని అలాగే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని ప్రకటించారు. కాగా ఉట్నూరు పోలీసు ఉన్నతాధికారులు గిరిజనులతో చర్చలు జరుపుతున్నారు.

తరలివచ్చిన నిర్మల్ కలెక్టర్...

ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న వరుణ్ రెడ్డిని ప్రభుత్వం ఇటీవలనే నిర్మల్ కలెక్టర్ గా నియమించింది. తాజాగా ఇక్కడ ఎవరికి పీఓగా పోస్టింగ్ ఇవ్వలేదు ఉట్నూరులో ఆదివాసుల ఆందోళన సమాచారం తెలుసుకున్న నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి హుటాహుటిన ఉట్నూరుకు చేరుకున్నారు. ఆదివాసీ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. వారి నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసుల ఆందోళనలో ఐటీడీఏ కార్యాలయం ఏవో కారు కూడా ధ్వంసం అయింది. ప్రాజెక్టు అధికారికి మెమోరాండం ఇచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వానికి పంపుతానని ఇచ్చిన హామీ మీదకు ఆదివాసులు తమ ఆందోళన విరమించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Next Story