ఎస్ఆర్పీ 3 గనిలో విషవాయువులు లీక్..

by Sumithra |
ఎస్ఆర్పీ 3 గనిలో విషవాయువులు లీక్..
X

దిశ, నస్పూర్ : గనిలో విషపూరితమైన గ్యాస్ లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థత చెందిన ఘటన శ్రీరాంపూర్ ఏరియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ- 3 గనిలో గురువారం ఉదయం నుండి కొద్దికొద్దిగా విషపూరితమైన వాయువులు వెలవడంతో కార్మికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. హాలర్ ఆపరేటర్ రజనీకాంత్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. విషవాయులను గమనించి మధ్యాహ్నం రెండు గంటల 10 నిమిషాలకు పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో 34వ డిస్టిక్ 2వ లెవెల్ 3వ సీమ్ లో పనిచేస్తున్న 23 మంది కార్మికులను మ్యాన్ రైడింగ్ సహాయంతో గని పైకి తీసుకొచ్చారు. విషవాయులు విస్తరించడంతో పదవరేసులో పనిచేస్తున్న హాలర్ ఆపరేటర్ రవి వాంతులకు గురయ్యాడు. గమనించిన కార్మికులు ఉన్నతాధికారులకు తెలపడంతో ఆస్పత్రికి తరలించారు.

మరొక హాలర్ ఆపరేటర్ రజనీకాంత్ గని నుండి ఇంటికి వెళ్ళగా గొంతునొప్పితో అస్వస్థకు గురయ్యాడని గమనించి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం బీజోన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో విషవాయువులు విస్తరిస్తుండడంతో రెండవ షిఫ్ట్ కార్మికులను గనిలోనికి యాజమాన్యం అనుమతించలేదు. కేవలం రెస్క్యూ టీం గనిలోకి ప్రవేశించి రక్షణ చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న కార్మిక సంఘాలు అధికారులు నిర్లక్ష్యంతోనే ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. సంఘటన స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న ఆర్కే-8 డిస్పెన్సరీ అంబులెన్స్ గంటల తరబడి రాకపోవడం విడ్డూరమని విమర్శించారు. అంబులెన్స్ లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed