కడెం మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Sridhar Babu |
కడెం మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, కడెం : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికారి యాత్రలో భాగంగా గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ప్రత్యేకించి రైతులకు వరదల వల్ల తీవ్రమైన నష్టం జరిగిందని, పంట పొలాలు ముంపునకు గురైన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అప్పులు చేసి వాళ్ల భూములను వాళ్లే బాగు చేసుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా కుట్రలు కుతంత్రాలతో ఇక్కడ ప్రాంతం నీళ్లు వాళ్ల పొలాలలోకి తీసుకుపోవడం కోసం రకరకాల డిజైన్లు మార్చి వాళ్లే మళ్ళీ ఎక్కడో ప్రాజెక్టులు కట్టడం తప్ప కానాపూర్ ప్రాంతానికి ఏ మాత్రం న్యాయం జరగడం లేదని అన్నారు.

దీనికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయన్నారు. ఇక్కడ తినడానికి తిండి లేక విదేశాలకు పోతున్నారని, కనీసం వాళ్లకోసం ఒక కోటి రూపాయలు పెట్టిన పరిస్థితి లేదన్నారు. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే 500 వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ బహుజన రాజ్యంలో ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని పునరుద్ధరించాలని కోరారు. పాఠశాల పిల్లలకు వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బన్సీలాల్ రాథోడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story